ప్రకాశం జిల్లా అటవీప్రాంతంలో మళ్ళీ పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. నాగార్జునసాగర్ – శ్రీశైలం అభయారణ్యం ప్రాంతంలో ఇటీవల కాలంలో పులులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. నల్లమల అటవీప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్తాయిలో పులుల సంఖ్య పెరిగింది. ఏడాది క్రితం అర్దవీడు అటవీప్రాంతంలో నాలుగు గ్రామాల్లో సంచిరించిన పెద్దపులి పదిరోజుల వ్యవధిలో రెండు ఆవులను చంపేసింది. మరో ఆవును తీవ్రంగా గాయపర్చింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పెద్దపులి సంచారం గురించి తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో పరిశీలించి పాదముద్రలు సేకరించారు. పాదముద్రలు పెద్దపులివిగా నిర్దారించారు. ఆ తరువాత రైతులు అటవీ ప్రాంతంవైపు పశువులను తోలుకపోవడంతో పులి జాడ కూడా లేకుండా పోయింది. అయితే తిరిగి ఏడాది తరువాత మళ్లీ పెద్దపులి పంజా విసిరింది. అర్ధవీడు అటవీప్రాంతంలో మేతకోసం అడవికి వెళ్ళిన ఆవును పెద్దపులి చంపి తినేయడంతో రైతులు వణికిపోతున్నారు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు రోజుల క్రితం మేత కోసం వెళ్ళిన ఆవుపై పెద్ద పులి దాడి చేసి చంపి తినేసింది. వెలగలపాయ గ్రామ రైతు వెంకట్రావుకు చెందిన ఆవు మేత కోసం అడవిలోకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అటవీ ప్రాంతంలో వెంకట్రావు ఆవు కోసం వెతుకుతున్న సమయంలో ఆవు మృతి చెంది కనిపించింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చనిపోయిన ఆవును పరిశీలించి పెద్దపులి దాడిలో మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఆవుకు పంచనామా నిర్వహించి అనంతరం ఆవును దహనం చేశారు. మృతి చెందిన ఆవు విలువ రూ.80 వేల రూపాయలు ఉంటుందని రైతు వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేస్తూ తెలిపాడు. అటవీశాఖ అధికారులు పెద్దపులి కదలికలను కనిపెట్టేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అటవీప్రాంతంలోకి పశువులను మేతకోసం వదలిపెట్టవద్దని రైతులకు అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి