Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ముఠాలు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఠాల ఆగడాలు విపరీతంగా పెరుగుతున్నాయి. పులివెందుల నుంచి గుండుగొలను వరకు వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వరుస ఘటనలు చూసి జనాలు హడలిపోతున్నారు. రెండున్నర నెలల క్రితం పులివెందులలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వారిని తాళ్లతో కట్టేసి బంగారు నగలు అపహరించుకుపోయారు. తిరుపతిలోనూ ఇదే తరహాలో అరకేజీ బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. ఇక అనంతపురం జిల్లా కదిరిలో నవంబరు 16న ఓ మహిళను దారుణంగా హత్య చేసి.. మరో మహిళను తీవ్రంగా గాయపరిచి బంగారం, నగదు దోచుకెళ్లారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడులో వృద్ధ దంపతుల్ని హత్యచేసి, భార్య చెవులు కోసి కమ్మలు లాక్కెళ్లారు దొంగల ముఠా. ఇటీవల టంగుటూరులో పీఎస్ కూతవేటు దూరంలోని ఓ ఇంట్లోకి రాత్రి 8గంటల ప్రాంతంలో దొంగలు చొరబడ్డారు. తల్లి, కుమార్తెల గొంతు కోసి బంగారం, నగదు చోరీ చేశారు.
ఇక పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలనులో నిద్రలో ఉన్న మహిళ ముఖంపై దిండు పెట్టి హత్య చేశారు. మంగళసూత్రాలు, చెవి కమ్మలతో పాటు బీరువాలో నగదుతో దుండగులు పరారీ అయ్యారు. అయితే, హైదరాబాద్ లాంటి నగరాల్లో హల్చల్ చేసే చెడ్డీ గ్యాంగ్ తాజాగా విజయవాడలో ప్రత్యక్షం అవడం.. చోరీకి పాల్పడటం తెలిసిందే. ఈ క్రమంలోనే చిట్టినగర్, గుంటుపల్లిలో పరిధిలో వరుస దోపిడీలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిల్లోనూ ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ఈ వరుస భయానక చోరీలు.. ప్రజలు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ దొంగల ముఠాలను అరికట్టాలని అధికారులను కోరుతున్నారు. కాగా, రాష్ట్రంలో చోరీ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దొంగల ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి వాటి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.
Also read:
Omicron Variant-Third Wave: భారత్ లో ఒమిక్రాన్ విలయతాండవం.. అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం..(వీడియో)