Andhra Pradesh: “ఇల్లు అద్దెకు ఇవ్వబడును”.. వృద్ధురాలి పాలట శాపంగా మారిన బోర్డు

ఇల్లు అద్దెకు ఇవ్వబడును అన్న బోర్డు పెట్టడమే ఆ వృద్ద మహిళ చేసిన తప్పిదమైంది... ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఓ యువకుడు వృద్ధురాలిపై పట్ట పగలు హత్యాయత్నం చేసి ఒంటిపై ఉన్న నగలు లాక్కెళ్ళాడు. ఒంగోలులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Andhra Pradesh: ఇల్లు అద్దెకు ఇవ్వబడును.. వృద్ధురాలి పాలట శాపంగా మారిన బోర్డు
Robbery
Follow us
Fairoz Baig

| Edited By: Balaraju Goud

Updated on: Aug 06, 2024 | 2:31 PM

ఇల్లు అద్దెకు ఇవ్వబడును అన్న బోర్డు పెట్టడమే ఆ వృద్ద మహిళ చేసిన తప్పిదమైంది… ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఓ యువకుడు వృద్ధురాలిపై పట్ట పగలు హత్యాయత్నం చేసి ఒంటిపై ఉన్న నగలు లాక్కెళ్ళాడు. ఒంగోలులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఒంగోలు నగరంలోని ఏనుగు చెట్టు సమీపంలోని అంకమ్మపాలెంలో పటాపంజుల సుగుణమ్మకు ఓ ఇల్లు ఉంది. మరో ఇంట్లో ఉంటున్న సుగుణమ్మ తన రెండో ఇంటిలో కింది పోర్షన్‌ అద్దెకు ఇచ్చారు. మొదటి పోర్షన్‌లో రేకుల షెడ్డు వేసి టూలెట్ బోర్డు పెట్టారు. ఆగస్ట్ 3వ తేదీన ఓ యువకుడు టూలెట్‌ బోర్డు పై ఉన్న ఫోన్‌ నంబరుకు కాల్ చేసి ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. దీంతో సుగుణమ్మ అక్కడకు వచ్చి తాళాలు తీసి ఇంటిని చూపించింది.

ఆ తర్వాత యువకుడి వివరాలు అడిగింది. తాను పొదిలి పట్టణానికి చెందిన వ్యక్తినని, ఒంగోలులో ఓ జడ్జి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నానని నమ్మబలికాడు సదరు యువకుడు. యువకుడి మాటలు నిజమని నమ్మిన సుగుణమ్మ ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు సమ్మతించారు. మరుసటి రోజు వచ్చి అడ్వాన్స్ ఇస్తానని చెప్పిన ఆ యువకుడు రెండో రోజు ఆదివారం వచ్చి సుగుణమ్మను అద్దె ఇంటికి దగ్గరకు రమ్మన్నాడు. మరోసారి ఇంటిని చూడాలని చెప్పి తాను అద్దెకు దిగుతానన్న పోర్షన్‌లోకి సుగుణమ్మను తీసుకెళ్ళాడు. ఈ సారి పక్కా ఫ్లాన్‌తో అక్కడికి చేరుకున్నాడు.

ముందుగానే తన వెంట తెచ్చుకున్న బలమైన ఆయుధంతో వృద్ధురాలి తలపై కొట్టాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం అయిన సుగుణమ్మ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమె మెడలో ఉన్న 5 లక్షల విలువైన తొమ్మిది సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి మెలుకువ వచ్చిన సుగుణమ్మ తన ఇంటికి వెళ్ళిపోయింది. తన బంధువులను పిలిపించి విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సుగుణమ్మను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని అదనపు ఎస్‌పి క్రైమ్స్‌ శ్రీధరరావు పరిశీలించారు. నిందితుడ్ని వెంటనే పట్టుకుంటామని ఏఎస్‌పి శ్రీధర్‌ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..