AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సస్పెన్స్.. ఏపీలో త్యాగం చేసేదెవరు..? అమిత్‌ షా వ్యాఖ్యల వెనక ఆంతర్యమేంటి..

ఏపీలో పొత్తుల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. జనసేన, టీడీపీ కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతున్న వేళ... నమ్మదగిన మిత్రులతోనే పొత్తులంటూ అగ్రనేత అమిత్‌షా చేసిన కామెంట్స్‌ .. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మార్చాయి. అప్రమత్తంగా ఉండాలంటూ జనసేన నేతలకు పవన్‌ లేఖ రాయడం మరో కీలకపరిణామంగా చెప్పొచ్చు. ఇంతకీ విపక్షాల మధ్య పొత్తులకు ఇంకెంత దూరం? అన్నదే ఆసక్తి రేపుతోంది.

Andhra Pradesh: సస్పెన్స్.. ఏపీలో త్యాగం చేసేదెవరు..? అమిత్‌ షా వ్యాఖ్యల వెనక ఆంతర్యమేంటి..
AP Politics
Shaik Madar Saheb
|

Updated on: Feb 11, 2024 | 8:43 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది.. విపక్షాల పొత్తుపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వరుస భేటీలు, చర్చోచపర్చలు జరుగుతున్నా… టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై స్పష్టత రావడం లేదు. అదిగో, ఇదిగో అనే మాటమాత్రం వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అగ్రనేత అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ కాంక్లెవ్‌లో పాల్గొన్న ఆయన… ఉత్తరాదిలో ఒంటరిగానే పోటీచేస్తున్న తాము.. దక్షిణాదిలో నమ్మదగిన మిత్రులతోనే కలిసి వెళ్తామని చెప్పారు. ఎన్డీఏలోకి పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయన్న అమిత్ షా… ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు.

ఏపీలో విపక్షాల పొత్తుపై రకరకాల ప్రచారం జరుగుతున్న వేళ.. పార్టీ నేతలకు బహిరంగలేఖ రాశారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. పొత్తుపై నాయకులెవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. భిన్నాభిప్రాయాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్న పవన్‌.. మరో 2 రోజుల్లో కూటమి పోటీ చేసే స్థానాలపై స్పష్టత వస్తుందని లేఖలో తెలిపారు. పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పవన్‌ హెచ్చరించారు.

పొత్తులపై టీడీపీ నుంచి కూడా.. త్వరలోనే అన్న మాటే వినిపిస్తోంది. కూటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఒకవేళ పొత్తు కుదిరితే… 175 అసెంబ్లీ సీట్లలో ఎక్కువత్యాగం టీడీపీనే చేయాల్సి వస్తుందని చెప్పారు. జనసేన క్యాడర్ పరంగా ఇంకా బలపడాల్సి ఉందన్న బుచ్చయ్య… ప్రజల్లో పవన్‌ బలంగానే ఉన్నారన్నారు. ఎప్పటికైనా రాజ్యాధికారమే లక్ష్యంగా పవన్‌ పనిచేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.

ఓ వైపు అధికార వైసీపీ ఒంటరిగా సిద్ధమవుతుంటే.. ప్రతిపక్షాలు పొత్తుకు ఇంకెంత దూరం? అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక అవగాహనకు వచ్చాయ్‌ కాబట్టి… ఇక కూటమిపై తుది నిర్ణయం బీజేపీదేనని తెలుస్తోంది. అయితే, దీనిపై హైకమాండ్‌ ఎలా చెబితే అలా అంటోంది ఏపీ కమలదళం. మరి, అమిత్‌ షా మాటల ప్రకారం త్వరలోనే ఏపీ పొత్తులపై క్లారిటీ వస్తుందా? లేక సాగదీత కొనసాగుతుందా? అనేది చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..