ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదతో కృష్ణా (Krishna River) నదిలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా తగ్గిన వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా జూరాల, సుంకేసుల జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా రివర్‌కు ఫ్లడ్ వాటర్ కంటిన్యూ అవుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కృష్ణా ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జూరాలకు (Jurala) భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు వస్తున్న వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి.దాంతో కృష్ణమ్మ మరోసారి శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. ఇక, జూరాల అప్ అండ్ డౌన్ పవర్ ప్లాంట్స్‌లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రెండు యూనిట్లలో కలిపి 470 కి పైగా మెగావాట్ల పవర్ జనరేషన్ జరుగుతోంది.
మరోవైపు తుంగభద్ర నుంచి వస్తోన్న వరద నీటితో కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజ్ నిండుకుండలా మారింది. వరద నీరు పోటెత్తుతుండటంతో ప్రాజెక్టు గేట్లెత్తి అధికారులు నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. సుంకేసుల రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 1.20 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 0.84 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సుంకేసుల నుంచి కేసీ కెనాల్‌కు 2,265 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే ఈ స్థాయి భారీ వరద రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.