
ఏపీకి కేంద్రం నుంచి అదిరిపోయే శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కొత్త మెడికల్ కాలేజీలు, ఆరోగ్య సేవల కోసం చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఆర్ధిక సహాయం అందించనుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగ్యస్వామంతో చేపట్టే ప్రాజెక్టులకు 40 శాతం వరకు ఆర్ధిక సాయం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ విషయం తెలుపుతూ లేఖ రాశారు. పీపీపీ పద్దతిలో నిర్మించే మెడికల్ కాలేజీలు, ఇతర ఆరోగ్య ప్రాజెక్ట్‌లకు కేంద్రం ఆర్దిక సాయం అందిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. మూలధన వ్యయంలో 30 నుంచి 40 శాతం వరకు గ్రాంట్‌గా ఇస్తామని, ఇక నిర్వహణ వ్యయంల 25 శాతం వరకు గ్రాంటుగా అందిస్తామని తన లేఖలో జేపీ నడ్డా పేర్కొన్నారు.
అయితే వయబులిటి గ్యాప్ ఫండింగ్ పథకం క్రింద పీపీపీ పద్దతిలో నిర్మించే ఆరోగ్య ప్రాజెక్ట్‌లకు కేంద్రం నిధులు అందిస్తోంది. ఇప్పటికే కేంద్రం రూ.2 వేల కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు కూడా దీనిని ఉపయోగించుకోవాలని, వైద్య సేవలు మరింతగా విస్తరించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. రాష్ట్రాల్లో ఆరోగ్య రంగం అభివృద్దికి ఇది సహాయపడుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా పీపీపీ సెల్‌ను ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్రాలు కూడా ఇలాంటి సెల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. పీపీపీ పద్దతిలో ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు ఈ సెల్‌లు ఉపయోగపడతాయని తెలిపింది.
ఆరోగ్య రంగంలో పీపీపీ మోడల్‌ను అమలు చేయడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని జేపీ నడ్డా లేఖలో తెలిపారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ పద్దతిని అవలంభిస్తున్నాయని, ఏపీ కూడా అందిపుచ్చుకోవడం హర్షణీయమన్నారు. అయితే ఆరోగ్య రంగంలో పీపీపీ పద్దతిని తీసుకురావడాన్ని ప్రతిపక్ష వైసీపీ గత కొద్దిరోజులుగా తప్పుబడుతోంది. ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో పీపీపీ ప్రాజెక్టులకు ప్రోత్సహించాలని, కేంద్రం నుంచి ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది.