Andhra Pradesh: అర్ధరాత్రి ఇంటి నుంచి శిశువు మాయం.. కుక్క ఎత్తుకెళ్లిందని అమ్మమ్మ గగ్గోలు.. చివరకు..!

పద్దెనిమిది రోజుల శిశువు.. ఇంట్లో తల్లి అమ్మమ్మ ఉన్నారు. ఆ చిన్నారి దివాన్ కాట్‌పై ఉంది. అర్థరాత్రి ఒక్కసారిగా అమ్మమ్మ లేచింది. బిడ్డ కనిపించలేదు. కేకలు పెట్టింది. తల్లి తల్లడిల్లిపోయింది.

Andhra Pradesh: అర్ధరాత్రి ఇంటి నుంచి శిశువు మాయం.. కుక్క ఎత్తుకెళ్లిందని అమ్మమ్మ గగ్గోలు.. చివరకు..!
Baby Safe
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Balaraju Goud

Updated on: Oct 09, 2024 | 8:11 AM

పద్దెనిమిది రోజుల శిశువు.. ఇంట్లో తల్లి అమ్మమ్మ ఉన్నారు. ఆ చిన్నారి దివాన్ కాట్‌పై ఉంది. అర్థరాత్రి ఒక్కసారిగా అమ్మమ్మ లేచింది. బిడ్డ కనిపించలేదు. కేకలు పెట్టింది. తల్లి తల్లడిల్లిపోయింది. కుక్క ఎత్తుకెళ్లిపోయిందని అమ్మమ్మ చెప్పడంతో.. ఆ తల్లి గుండె విలవిల్లాడిపోయింది. బయటకు వచ్చి కేకలు పెట్టడంతో స్థానికులంతా గుమిగూడారు. పోలీసులకు కూడా రంగంలోకి దిగారు. రాత్రంతా వెతికారు.. విశాఖపట్నం పరిధిలోని ఆరిలోవలో ఈ ఘటన జరిగింది. చివరకు ఆ శిశువు అనకాపల్లి జిల్లా కసింకోటలో సేఫ్ గా తేలింది. రాత్రికి రాత్రే ఆ శిశువు జిల్లా సరిహద్దులు దాటి అంత దూరం ఎలా వెళ్ళిపోయింది..? అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.

విశాఖ ఆరిలోవ రామకృష్ణాపురంలో మొవ్వల శ్రీనివాస్, మంగ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె భవాని. డొక్కా శివ అనే వ్యక్తి చంటి భవానిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ అన్యోన్యంగానే ఉంటున్నారు. 2021 లో వీరు వివాహం జరిగింది. 2022 డిసెంబర్ 31న ఒక పాప జన్మించింది. మళ్లీ భవాని గర్భం దాల్చడంతో తల్లి ఇంటికి వచ్చింది భవాని. ఈ ఏడాది ఆగస్టు 22న రామకృష్ణాపురం వచ్చి… సెప్టెంబర్ 19న డెలివరీ అయింది. రెండోసారి కూడా పాపకు జన్మనిచ్చింది భవాని.

అర్ధరాత్రి రంగంలోకి దిగిన పోలీసులు..

మంగ ఇంట్లో.. కూతురైన బాలింత భవాని శిశువు ఉన్నారు. రాత్రి నిద్రిస్తున్నారు. ఇంట్లో దివాన్ కాట్ పై ఉన్న శిశువు మాయమైంది. 18 రోజుల శిశువును కుక్క ఎత్తుకెళ్లిందని అమ్మమ్మ హడావిడి చేసింది. గత అర్ధరాత్రి ఘటన జరిగింది. కంట్రోల్ రూమ్ కాల్ తో అలర్ట్ అయిన పోలీసులు.. రంగంలోకి దిగారు. కృష్ణాపురంలో పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రత్యేక బృందాలుగా గాలించారు. ఎక్కడ శిశువు ఆచూకీ లేకపోవడంతో అయితే ఇది కుక్క ఎత్తుకెళ్లిన ఘటన కాదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.

చివరకు కసింకోటలో..

ఆ తర్వాత కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు.. ఎట్టకేలకు శిశువు అనకాపల్లి జిల్లా కసింకోటలో ఉన్నట్టు గుర్తించారు. అమ్మమ్మ మంగనే స్వయంగా.. తమ బంధువులకు శిశువును పెంచుకునేందుకు ఇచ్చినట్టు నిర్ధారించారు పోలీసులు. అతర్వాత ఓ కట్టుకథ అల్లినట్లు పోలీసులు నిర్ధారించారు. మూడు గంటల్లో శిశువు మిస్సింగ్ మిస్టరీని ఛేదించారు పోలీసులు సేఫ్ గా 18 రోజుల ఆడ శిశువు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

అసలు కథ ఇదే..

మూడు గంటల్లోనే శిశువు అపహరణ మిస్టరీ ఛేదించామన్నారు పోలీసులు. అమ్మమ్మే శిశువును బంధువులకు అప్పగించిందన్నారు. శిశువును కుక్క ఎత్తుకెళ్లిందని నమ్మించే ప్రయత్నం చేసిందని.. తన కూతురు ఆర్థిక కష్టాలు చూడలేక శిశువును బంధువులకు అప్పగించిందన్నారు. రెండో సంతానం ఎవరు పుట్టిన దత్తకు ఇవ్వాలని ముందే అనుకున్నారని, రెండో శిశువు పుట్టిన తర్వాత ఎలాగైనా తామే పెంచుకోవాలని తల్లిదండ్రులు భావించారని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు తెలియకుండా అమ్మమ్మ బంధువులకు అప్పగించి డ్రామా ఆడింది. అర్ధరాత్రి బంధువులను పిలిపించి వాళ్లకు అప్పగించి కుక్క ఎత్తుకెళ్లినట్టు పుకారు చేసిందని ఆరిలోవ సీఐ గోవిందరావు తెలిపారు.

నానమ్మ కన్నీరు.. గుండెలు పట్టుకున్న స్థానికులు..

పసిపాపను కుక్క ఎత్తుకెళ్లిపోయిందని చెప్పడంతో గుండెలు పట్టుకున్నామన్నారు శిశువు నానమ్మ. ఎక్కడుందో ఏమైపోయిందని ఆందోళన చెందారు. రాత్రికి రాత్రి వచ్చి అంతా వెతికామని.. పాపను బంధువులకు దత్తత ఇస్తున్నట్టు కనీసం చెప్పి ఉన్నా సంతోషించే వాళ్ళమన్నారు. కనీసం పాప తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా అర్థరాత్రి బంధువులకు అమ్మమ్మ ఇచ్చేసిందని, పాపను పోలీసులు క్షేమంగా తీసుకురావడంతో సంతోషం వ్యక్తం చేసింది పాప నానమ్మ. పాప సేఫ్ గా చేరడంతో స్థానికులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.

అందుకే అలా చేశా..: అమ్మమ్మ మంగ

తన కూతురి ఇంట్లో ఆర్థిక కష్టాలు పెరిగాయని, రెండో సంతానం పుడితే దత్తత ఇచ్చేయాలని అనుకున్నామన్నారు శిశువు అమ్మమ్మ మంగ. ఆ తర్వాత కూతురు అల్లుడు మనసు మార్చుకున్నారని, కూతురు ఆర్థిక కష్టాలు చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. దూరపు బంధువులకు అర్ధరాత్రి పిలిచి ఇచ్చేశానన్నారు. అలా చేస్తే తన కూతురికి ఆర్థిక కష్టాలు గట్టెకుతాయని, పాప కూడా బంధువుల దగ్గర ఆనందంగా ఉంటుందని అనుకున్నట్లు తెలిపింది. పాపను కుక్క ఎత్తుకెళ్లిందని కూతురికి ముందుగా చెప్పా నాన్నారు. ఆ సమయంలో తల్లడిల్లిపోయి ఏడ్చింది. ముందే విషయం చెబితే ఒప్పుకోరని, ఈ పని చేశా నని, కూతురు కోసమే శిశువును దత్తతకు ఇచ్చేశానన్నారు. శిశువును అప్పగించిన కుటుంబానికి కూడా సంతానం లేరని, వాళ్లు శిశువును బాగా చూసుకుంటారని అనుకొని ఇచ్చేశానని పోలీసులకు తెలిపింది శిశువు అమ్మమ్మ మంగ.

శభాష్ పోలీస్..

ఈ విషయంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఒకవైపు.. రాత్రి శిశువు కోశం గాలిస్తూనే, మరోవైపు అసలు మిస్టరీని గంటల్లోనే ఛేదించారు. అంతేకాదు.. మూడు గంటల్లోనే శిశువును గుర్తించి, పేరెంట్స్ ఒడికి చేర్చారు. దీంతో పోలీసులను అంతా అభినందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..