Andhra Pradesh: రోజురోజుకూ మానవత్వం మంటగలుస్తోంది. ప్రజలకు సేవ చేయాల్సిన వారు, కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా, నెల్లూరులో ఆర్టీసీ డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు.
ప్రజల పన్నులను జీతాలుగా తీసుకునే కొందరి తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా, నెల్లూరులో అభంశుభం తెలియని పాప పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఆర్టీసీ డ్రైవర్. ఆపరేషన్ కోసం చెన్నై వెళ్తున్న చిన్నారిని, ఆమె తల్లిదండ్రులను బస్సులో నుంచి మధ్యలోనే దింపేశాడు. బస్సులో పెద్ద పెద్ద శబ్ధాలతో పాటలు పెట్టిన డ్రైవర్‌ను, కాస్త సౌండ్ తగ్గించమని ప్రాథేయపడ్డారు. పాప ఆరోగ్యం బాగోలేదని, సౌండ్ తగ్గించాలని కోరారు. అంతే, అదే వారు చేసిన పాపంగా, వెంటనే వారిని వాసిలి గ్రామం దగ్గర దించేశాడు బస్సు డ్రైవర్.
బ్రైన్‌కు సంబంధించిన ప్రాబ్లమ్‌తో బాధపడుతోంది ఆ చిన్నారి. దీంతో పాపను తీసుకొని ఆపరేషన్ కోసం ఆత్మకూరు నుంచి చెన్నైకు బయల్దేరారు తల్లిదండ్రులు. ఆ సమయంలో బస్సులో పాటల సౌండ్ భరించలేక పాప విలవిలలాడిపోతోందని, సౌండ్ తగ్గించమని డ్రైవర్‌ను బ్రతిమిలాడారు. కానీ, ఏమాత్రం కనికరం లేకుండా వారిని బస్సులోనుంచి దింపేశాడు డ్రైవర్. దీంతో ఆత్మకూరు డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు.