Tenali: మీ కడుపులు చల్లగుండ.. ఎంత మంచి ఆలోచన చేశారండి…

| Edited By: Ram Naramaneni

Sep 18, 2024 | 7:57 PM

ప్రతి ఏటా వివాహం వార్షికోత్సవం రోజున బంధుమిత్రులను పిలిచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది అందరూ చేసే పనే. కానీ అన్నం పెట్టే రైతులకు ఈసారి ఇంటికి పిలిచి.. ఆతిథ్యం పెట్టి.. బట్టలు పెట్టాలనుకున్నారు ఈ దంపతులు.. అనుకున్నదే తడవుగా....

Tenali: మీ కడుపులు చల్లగుండ.. ఎంత మంచి ఆలోచన చేశారండి...
Srivivasarao Couple With Farmers
Follow us on

పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం చూస్తుంటాం… పెళ్లి రోజును కూడా ఘనంగా జరుపుకోవడం మనందరికి తెలిసిందే.. చుట్టాలను, స్నేహితులను, ఇరుగుపొరుగువారిని ఇలా అందరిని పిలిచి ఘనంగా భోజనాలు కూడా పెడుతుంటారు. అయితే ఈయన మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వివాహా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కానీ అతిధిలు మాత్రం మారిపోయారు.

తెనాలికి చెందిన మడుపల్లి వెంకట మోహన శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజలకు వివాహం అయి నలభై ఏళ్లు పూర్తయింది. 40వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనుకున్నారు. అయితే గతంలో కిళ్లీ కొట్టు నిర్వహించిన శ్రీనివాసరావు ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. ఎప్పుడు చుట్టాలను, స్నేహితులను పంక్షన్లకు ఆహ్వానిస్తూనే ఉన్నాం కానీ సమాజ హితం కోరే రైతులను మాత్రం ఎప్పుడు శుభకార్యానికి పిలవలేదు.. ఈసారి వారిని తప్పకుండా పిలవాల్సిందే అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. శ్రీనివాసరావు నిర్ణయానికి అందరూ ఒకే చెప్పారు.

దీంతో తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లోని నలభై మంది రైతులను గుర్తించాడు. వారందరిని తన వివాహ వార్షికోత్సవ వేడకకు రావాల్సిందిగా స్వయంగా వెళ్లి ఆహ్వానించాడు. వచ్చిన వారందరికి భోజనాలు పెట్టడమే కాకుండా రైతే రాజు.. రైతు లేనిదే సమాజం లేదంటూ వారందరికీ గౌవరప్రధంగా సన్మానం కూడా చేశారు ఈ దంపతులు. శాలువతో సత్కరించడంతో పాటు నూతన వస్త్రాలను బహుకరించి రైతు చిహ్నమైన కండువాను ప్రత్యేకంగా అందించారు.

తమని గుర్తించి ఈ విధంగా సన్మానం చేసిన వాళ్లు లేరని, తమని ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించిన శ్రీనివాసరావు దంపతులు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి అని వచ్చిన అన్నదాతలు కూడా మనస్సారా దీవించి వెళ్లిపోయారు.