TDP-Janasena: టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. రేపు కీలక భేటీ.. త్వరలోనే..

| Edited By: Shaik Madar Saheb

Nov 12, 2023 | 10:52 AM

తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రజల్లోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పొత్తు ప్రకటన వెలువడి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఉమ్మడి ఐక్య కార్యాచరణపై పూర్తి స్పష్టత రాలేదు. దీంతో ఈ నెల తొమ్మిదో తేదీన విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో జేఏసీ సమావేశం జరిగింది. ఈ జేఏసీ సమావేశంలో రెండు పార్టీలు ఇకపై దూకుడు పెంచాలని నిర్ణయించాయి. ఎలాంటి కార్యక్రమం చేపట్టినా..

TDP-Janasena: టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు.. రేపు కీలక భేటీ.. త్వరలోనే..
Pawan Kalyan --Chandrababu
Follow us on

తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రజల్లోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పొత్తు ప్రకటన వెలువడి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఉమ్మడి ఐక్య కార్యాచరణపై పూర్తి స్పష్టత రాలేదు. దీంతో ఈ నెల తొమ్మిదో తేదీన విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో జేఏసీ సమావేశం జరిగింది. ఈ జేఏసీ సమావేశంలో రెండు పార్టీలు ఇకపై దూకుడు పెంచాలని నిర్ణయించాయి. ఎలాంటి కార్యక్రమం చేపట్టినా.. ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా.. రెండు పార్టీల ప్రతినిధులు ఉండాలని నిర్ణయించాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు ముగియడంతో.. నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు జరపాలని జేఏసీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14,15,16 తేదీల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల ద్వారా రెండు పార్టీల నేతలు ఒకే తాటిపైకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకూ ఎలాంటి కార్యాచరణ అయినా ఈ సమన్వయ కమిటీల ద్వారా జరగనున్నాయి. ఇలా చేయడం వల్ల రెండు పార్టీల ఓట్ల బదలాయింపునకు ఇబ్బంది ఉండదనేది ఇరు పార్టీల అభిప్రాయంగా తెలుస్తుంది. ఇక క్షేత్ర స్థాయి పోరాటాల కోసం జేఏసీ సన్నద్ధమైంది. ముందుగా మేనిఫెస్టో సిద్ధం చేసుకుని.. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తూ మేనిఫెస్టోపై ప్రచారం చేయాలని నిర్ణయించాయి. మేనిఫెస్టో రూపకల్పన కోసం రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేశారు.

రేపు మేనిఫెస్టో కమిటీ మొదటి సమావేశం

ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు రెండు పార్టీల నుంచి ముగ్గురు సభ్యుల చొప్పున కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యులుగా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు,పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఉన్నారు. ఇక జనసేన పార్టీ నుంచి జనవాణి సమన్వయకర్త వర ప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ.. పీఏసీ సభ్యుడు ముత్తా శశిధర్, జనసేన అధికార ప్రతినిధి శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మొదటి సమావేశం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుంది. ఇప్పటికే టీడీపీ రాజమండ్రి వేదికగా సూపర్ సిక్స్ హామీలు ప్రకటించింది. మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువగళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు హామీలు ఇచ్చింది. ఇక జనసేన కూడా నాలుగైదు ప్రతిపాదనలు ముందుకి తెచ్చింది. రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను ముందుకు తెచ్చింది.. రెండు పార్టీల ప్రతిపాదనలపై మేనిఫెస్టో కమిటీలో చర్చించనున్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ హామీలను వివిధ రూపాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లారు ఇక జనసేన పెట్టె ప్రతిపాదనలను కూడా జోడించి ఉమ్మడి మేనిఫెస్టోపై కమిటీ ఇక నిర్ణయానికి రానుంది. పలుమార్లు సమావేశం అయిన తర్వాత మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

ఈ నెల 17న మేనిఫెస్టో విడుదల చేసే ఆలోచనలో రెండు పార్టీలు

ఈ నెల 18 నుంచి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేయాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు.. ముందుగా రోడ్ల సమస్యపై ఈ నెల 18,19 తేదీల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. దానికంటే ముందుగానే మేనిఫెస్టో పై ఒక స్పష్టతకు రావాలని జేఏసీ నిర్ణయించింది. ఈ నెల 17 న మెనుఫెస్టో విడుదల చేసి 18 నుంచి ప్రజల్లోకి వెళ్లేలా కసరత్తు చేస్తున్నారు రెండు పార్టీల నేతలు.. రోడ్ల సమస్యతో మొదలు పెట్టి కరెంట్ చార్జీల పెంపు, రైతుల సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న కరువు, నిత్యావసరాల ధరల పెరుగుదల, యువతకు ఉద్యోగాలు లేకపోవడం వంటి సమస్యలపై వరుసగా ఆందోళలనలకు రెండు పార్టీల నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..