Huzurabad: హుజురాబాద్‌లో 26.. బద్వేల్‌లో 31..! బైపోల్ వార్‌లో నమోదైన నామినేషన్లివి. రెండు చోట్లా రాజకీయం రంజుగా మారింది. టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇక, ఇవాళ్టితో నామినేషన్లు ప్రక్రియ ముగిసింది. ఇక అసలు యుద్ధం ముందుంది. హుజురాబాద్, బద్వేల్..రెండు చోట్లా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతోపాటు ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. స్క్రూటినీ తర్వాత ఎంత మంది పోటీలో ఉంటారనేది తేలనుంది. ఉపసంహరణకు ఈనెల 13 వరకు టైమ్ ఉంది.
3 నెలలుగా తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్న హుజురాబాద్ బైపోల్‌లో మొత్తం 26 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఉపయుద్ధాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్..మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించింది. భారీ మెజార్టీతో గెలువడమే టార్గెట్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ వేసిన TRS అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. మరో సెట్ వేశారు. ఆయన వెంట మంత్రి హరీష్‌రావు ఉన్నారు. విజయంపై ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ క్యాండిడేట్ ఈటల రాజేందర్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు..మరికొందరు సీనియర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు.
హుజురాబాద్‌తో పోలిస్తే బద్వేల్ ప్రీమియర్ లీగ్‌లో హడావుడి కాస్త తక్కువే. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ మరో సెట్ పత్రాలు సమర్పించారు. ర్యాలీగా నామినేషన్ సెంటర్‌కు వెళ్లారు. ప్రభుత్వ సంక్షేమపథకాలే తనకు భారీ మెజార్టీ కట్టబెడుతాయని దీమా వ్యక్తం చేశారు సుధ. బద్వేల్ బరి నుంచి టీడీపీ, జనసేన తప్పుకున్నాయి. కానీ కాంగ్రెస్, బీజేపీ మాత్రం బరిలో నిలిచాయి. దీంతో త్రిముఖపోరు నెలకొంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలో నిలిచారు. ఇక బీజేపీ స్టూడెంట్ లీడర్‌ను తెరపైకి తెచ్చింది. సురేష్ పనతాల బరిలో నిలిచారు. జనసేన పోటీలో లేకున్నా..తమకు మద్దతుగా ప్రచారం చేస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. హుజురాబాద్, బద్వేల్ బైపోల్ పోలింగ్ ఈనెల 30న జరగనుంది. నవంబర్ 2న కౌంటింగ్ ఉంటుంది.