Pawan Kalyan: జనసేన పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఓటమి ప్రభావం ఏపీలో ఉంటుందా..

|

Dec 06, 2023 | 9:30 PM

సూటిగా ఓ ప్రశ్న. తెలంగాణలో జనసేన చవిచూసిన దారుణ ఓటమి ఏపీలో ప్రభావం చూపుతుందా? కచ్చితంగా కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది. తెలంగాణలో జనసేన పోటీ చేయడం ఇదే మొదటిసారి. 8 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీట్లో కూడా గెలవలేదు. కనీసం డిపాజిట్లు దక్కలేదు. 8 మంది అభ్యర్ధులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే 59వేలు మాత్రమే. అది కూడా బీజేపీతో పొత్తులో ఉండి. పోనీ, జనసేన వల్ల బీజేపీకి ఏమైనా లాభం జరిగిందా అంటే.. అదేం లేదు.

Pawan Kalyan: జనసేన పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఓటమి ప్రభావం ఏపీలో ఉంటుందా..
Janasena Party
Follow us on

సూటిగా ఓ ప్రశ్న. తెలంగాణలో జనసేన చవిచూసిన దారుణ ఓటమి ఏపీలో ప్రభావం చూపుతుందా? కచ్చితంగా కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది. తెలంగాణలో జనసేన పోటీ చేయడం ఇదే మొదటిసారి. 8 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్క సీట్లో కూడా గెలవలేదు. కనీసం డిపాజిట్లు దక్కలేదు. 8 మంది అభ్యర్ధులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే 59వేలు మాత్రమే. అది కూడా బీజేపీతో పొత్తులో ఉండి. పోనీ, జనసేన వల్ల బీజేపీకి ఏమైనా లాభం జరిగిందా అంటే.. అదేం లేదు. గ్రేటర్‌లో బలం ఉందనుకున్న పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు వచ్చింది. ఓవరాల్‌గా జనసేన ఓట్లు బీజేపీకి వెళ్లలేదు, బీజేపీ ఓట్లు జనసేనకు రాలేదు. పేరుకే పొత్తు తప్ప రెండు పార్టీల మధ్య ఓట్‌ షేరింగ్‌ జరగనేలేదని అర్ధం. సరే.. ఓట్ షేర్ సంగతి తరువాత. అసలు ఈ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుంది? ఇదే మెయిన్ క్వశ్చన్.

ముఖ్యంగా టీడీపీతో జరిపే సీట్ల చర్చలో తెలంగాణ ఓటమి కచ్చితమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు కొందరు. ఎందుకంటే.. పవన్‌ కల్యాణ్‌ను సీఎంగా చూడాలనేది జనసేన కార్యకర్తల ఆరాటం. కాని, సంస్థాగతంగా తమ బలం ఎంత అన్నది అభిమానులు, కార్యకర్తలు ఆలోచించడం లేదు. పవన్‌ను చూసుకుని పార్టీ చాలా బలంగా ఉందని చెప్పుకోవడం తప్ప ఆ అభిమానం ఓట్లుగా మారవు అని గత ఎన్నికల్లోనే అర్థమైంది. నిజానికి తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే రిఫ్లెక్ట్ అయింది. తెలంగాణలో జనసేనకు బలమైన ఓటు బ్యాంక్‌ ఉందని ఆ పార్టీ చెప్పుకుంది. ఆ బలం చూసుకునే ఎన్నికలకు ఒంటరిగా వెళ్తామని మొదట ప్రకటించింది కూడా. తెలంగాణలో 32 సీట్లలో పోటీకి రెడీ అయింది. చివరికి 8 సీట్లలోనే పోటీ చేసింది. కాని, ఆనాడు జనసేన చెప్పిందేంటంటే.. కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో బలమైన ఓటు బ్యాంక్ తమ సొంతం అని. కాని, ఎన్నికల ఫలితాలు చూస్తే.. 8 మంది పోటీ చేసినా అందరికీ కలిపి 60వేల ఓట్లు కూడా రాలేదు. అంటే, మాటలు, ప్రకటనల్లో మాత్రమే జనసేనకు బలం తప్ప.. వాస్తవానికి ఆ పార్టీ పరిస్థితి ఏంటో గణాంకాలే చెబుతున్నాయి. రేప్పొద్దున టీడీపీతో సీట్ల గురించి చర్చించేటప్పుడు కూడా ఈ టాపిక్‌ రాకుండా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. జనసేనకు మహా అయితే ఓ పాతిక సీట్లు ఇస్తారనే చర్చ జరిగినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు టీడీపీపై మండిపడ్డారు. అందుకే, పవన్ కల్యాణ్ కూడా గౌరవప్రదమైన సీట్లు అడుగుతాం అన్నారు. చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు.. ముందు వెనక ఆలోచించకుండా పొత్తుకు రెడీ అని ప్రకటించడంతో జనసేనపై టీడీపీలో సానుభూతి పెరిగింది. కష్ట సమయంలో తమకు తోడుగా ఉన్నారు కాబట్టి మరో పది సీట్లు ఎక్కువ ఇచ్చినా ఫర్వాలేదనే ఆలోచన టీడీపీ కార్యకర్తల్లో వచ్చింది. కాకపోతే, అలాంటి సమయంలో తెలంగాణలో పోటీ చేయడం, దారుణంగా దెబ్బతినడంతో.. బేరం మళ్లీ పది సీట్ల నుంచి గానీ మొదలవుతుందా అనే చర్చ జరుగుతోంది.

సరే.. సీట్ల షేరింగ్ రెండు పార్టీల మధ్య జరిగే అవగాహనను బట్టి ఉంటుంది. కాని, తెలంగాణలో జనసేన ఓటమిని అధికార పక్షం అంత తేలిగ్గా వదులుతుందా? కచ్చితంగా వదలదు. ఆయన రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేదు, తెలంగాణలోనూ అభ్యర్ధులను గెలిపించుకోలేదు అనే విమర్శ వస్తుంది. దీనికి జనసేన సిద్ధపడాల్సి ఉంటుంది. అయితే, బీజేపీ మాత్రం ఏ రాష్ట్ర పరిస్థితులు దానివే అంటోంది. తెలంగాణలో ఆదరించకపోయినంత మాత్రాన.. అదే సెంటిమెంట్‌ ఏపీలోనూ రిపీట్ అవుతుందని చెప్పలేం అంటోంది బీజేపీ.

తెలంగాణలో జనసేన ఓటమి ఏపీలో పెద్దగా ప్రభావం చూపించదు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా. ఎందుకంటే, తెలంగాణలో పవన్ కల్యాణ్ పెద్దగా ప్రచారం చేసింది లేదు. అంత ఎఫర్ట్ కూడా చూపించలేదు. తెలంగాణలో తమ పార్టీ బలం ఏంటో తెలుసు కాబట్టే పవన్ చివరి నాలుగు రోజులు మినహా ప్రచారానికి వెళ్లలేదని అందరికీ తెలుసు. సో, తెలంగాణలో ఓటమిని ఏపీలో పట్టించుకోకపోవచ్చు అనేది ఓ అంచనా. అటు టీడీపీ కూడా ఓటమిని సాకుగా చూసే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిని టీడీపీ అసలు కన్సిడర్‌ చేయకపోవచ్చు. ఎందుకంటే, ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణమే వేరు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేదే రెండు పార్టీల లక్ష్యం. సో, సీట్ల విషయంలో అంతకు ముందు ఏ ఒపీనియన్‌తో ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉండొచ్చు. పైగా రెండు పార్టీల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న గొడవలను కూడా పెద్దగా లెక్కచేసే పరిస్థితిలో లేరు. 175 నియోజకవర్గాల్లో ఒకట్రెండు చోట్ల అసంతృప్తులు రగిలినా పెద్దగా పట్టించుకునే పరిస్థితిలో లేవు టీడీపీ అండ్ జనసేన. పైగా ఈమధ్యే పవన్‌ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారిని వైసీపీ కోవర్టులుగానే చూస్తామని చెప్పేశారు. సో, ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఎట్టిపరిస్థితుల్లో వీగిపోదనే చెప్పాలి.

ఇక్కడ పొత్తు విషయం గురించి కూడా ఓసారి మాట్లాడుకోవాలి. బీజేపీ-జనసేన బంధం తెలంగాణ వరకేనా.. ఏపీలో కూడా కొనసాగుతుందా? ఆమాటకొస్తే.. జనసేన బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూడలేదు. బీజేపీనే పొత్తు కోసం జనసేన దగ్గరికి వెళ్లింది. తెలంగాణలో ఒంటరి పోరుకు వెళ్తున్నాం, 32 సీట్లలో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నామని చెప్పిన తరువాత బీజేపీ అలర్ట్ అయింది. రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో.. బీజేపీ కోసం జనసేననే ఓ మెట్టు తగ్గి 8 సీట్లకు పోటీ చేసింది. జాగ్రత్తగా పరిశీలిస్తే.. జనసేన బీజేపీతోనే ఉంది అని చెప్పుకోడానికి కూడా లేదు. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే.. మళ్లీ చంద్రబాబుతో సమావేశమయ్యారు పవన్ కల్యాణ్. పొత్తులో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు తలమునకలయ్యారు. అంటే, పొత్తు తెలంగాణ వరకే అని చెప్పకనే చెప్పినట్టైంది. పైగా బీజేపీనే తమతో కలిసిరావాలి గానీ.. తాము పొత్తు కోసం బీజేపీ దగ్గరకు వెళ్లబోం అనే సంకేతం కూడా పంపినట్టైంది. ఆల్రడీ తెలంగాణలో జరిగింది అదే. సో, ఏపీలో కూడా బీజేపీనే కాస్త తగ్గి జనసేన దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. బీజేపీ మాత్రం తమ నిజమైన మిత్రుడు జనసేననే అని చెప్పుకుంటోంది. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందని విమర్శిస్తోంది బీజేపీ. నిజంగా టీడీపీ-జనసేన పొత్తులో ఉంటే.. తెలంగాణలో తమతో ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ నేతలు విమర్శిస్తున్నట్టుగా టీడీపీ-జనసేన మధ్య పొత్తులో ఎలాంటి పొరపొచ్చాలు లేవు. టీడీపీ-జనసేన ఫుల్ క్లారిటీతో ఉన్నాయి. ఏపీలో రెండు పార్టీలు ఎలా సహకరించుకుని ముందుకు వెళ్లాలనే దానిపైనే కసరత్తు చేస్తున్నాయి. పైగా రెండు పార్టీల మధ్య ఓట్ షేరింగ్‌ గురించి కూడా గట్టి చర్చే జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ 90 శాతం ఓట్ల షేరింగ్ జరగాల్సిందేననేది రెండు పార్టీల టార్గెట్. తెలంగాణలో అదే మిస్ అయింది. పేరుకే పొత్తు తప్ప బీజేపీ-జనసేన మధ్య ఓట్ షేర్ జరగలేదని చెబుతున్నారు. ఒకవేళ అలా జరిగి ఉంటే.. కూకట్‌పల్లి నుంచి జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్ధికి డిపాజిట్‌ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో జనసేనకంటే బీజేపీకే కొంత బలం ఉందని అందరికీ తెలుసు. అయినా సరే డిపాజిట్ రాలేదంటే.. రెండు పార్టీల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు జరగలేదనే అర్థం. సో, ఏపీలో ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు అండ్ పవన్. పేరుకు మాత్రం పొత్తు పెట్టుకుని, క్షేత్రస్థాయిలో అటు ఓట్లు ఇటు, ఇటు ఓట్లు అటు పడకపోతే మొదటికే మోసం వస్తుంది. చంద్రబాబు-పవన్‌ కలిస్తే సరిపోదు. గ్రామస్థాయిలో కార్యకర్తలు కలిసి పనిచేయాలి. అలా జరిగినప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడుతుంది. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య ఇంకాస్త కసరత్తు జరగాల్సి ఉంది.

ఓవైపు ఇన్నిసార్లు సమావేశమై చర్చిస్తున్నా.. టీడీపీ-జనసేన మధ్య కొన్ని వ్యవహారాలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. అలాంటిది ఎన్నికలకు ఒకట్రెండు నెలల ముందు బీజేపీ పొత్తులోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. అసలు, ఆ టైమ్‌కి బీజేపీకి స్పేస్ ఉంటుందా? రెండు పార్టీలు ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో రెడీ చేసుకున్నాయి. రేప్పొద్దున సీట్లు పంపిణీ కూడా చకచకా జరిగిపోతుంది. అలాంటిది చివరి నిమిషంలో బీజేపీ వచ్చి చేరితే.. సీట్ల పంపిణీ జరిగేనా? సో, ఓవరాల్‌గా ఇక్కడ తొందరపడాల్సింది బీజేపీనే. పొత్తుకు దూరంగా ఉండదలచుకుంటే.. ఇప్పటి నుంచే కార్యాచరణ రెడీ చేసుకోవాలి. లేదు.. పొత్తులో చేరతాం అన్నా కూడా ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాలి. రోజులు, వారాలు గడుస్తున్న కొద్దీ టీడీపీ-జనసేనకు బీజేపీ దూరం కావాల్సి వస్తుంది. ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేంటంటే.. తెలంగాణలో జనసేన-బీజేపీ పొత్తు అక్కడి వరకే. ఏపీలో యథావిధిగా టీడీపీ-జనసేన మధ్య పొత్తు నడుస్తుంది. సో, కలిసి వెళ్లాలా వద్దా అని ఆలోచించుకోవాల్సిందల్లా బీజేపీనే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..