తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఎండలు, ఉక్కపోత ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. మరోవైపు ఉత్తర అండమాన్ సముద్రంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పగటిపూట ఎండ మండిపోతోంది. ఇక రాత్రి పూట ఉక్కపోత ఎండాకాలన్ని తలపిస్తోంది. అక్టోబర్‌లోనే సమ్మర్ వచ్చిందా అన్నట్టు ఉంది వాతావరణం. ఏపీ, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో, ఏపీలో య36 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా.. మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండంగా బలపడనుందని తెలిపింది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ – యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం వాతావరణ సూచనలు..
కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:
ఆదివారం తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ:-
తేలికపాటినుండి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాకుండా.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేసింది.
