ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కన్నెర్ర చేస్తే వైసీపీ నేతలు బయటకు రాలేరని వ్యాఖ్యానించారు. అరాచక పాలనపై మాడేళ్లుగా పోరాటం చేస్తున్నామన్న చంద్రబాబు.. ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని ఆక్షేపించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రశ్నించిన వారిని బెదిరించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమీ సాధించలేరని, తాము తలుచుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఊరురా తిరిగి ముద్దులు పెడుతూ పాదయాత్ర చేసే వారా? అని ప్రశ్నించారు. అప్పుడేమో ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఇంటి నుంచి ఒకరు బయటకు రావాలని పిలువునిచ్చారు.
టీడీపీ పాలనలో ప్రతి గ్రామంలో స్కూల్స్ నిర్మించాం. కానీ ఈ గవర్నమెంట్ మాత్రం అమ్మ ఒడికి ఆంక్షలు పెట్టి తల్లులను మోసం చేస్తోంది. ఇంగ్లిష్ మీడియం ఒక నాటకం. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ఛార్జీలు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలు పెరిగాయి. జగన్ .. సొంత డిస్టిలరీలు పెట్టుకుని మద్యం రేట్లు పెంచారు. నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు.
– నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి