అనకాపల్లి(Anakapalle) జిల్లా చోడవరం వేదికగా నిర్వహించిన మినీ మహానాడులో.. వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను ఇబ్బందులు పెడితే వారి గుండెల్లో నిద్రపోతానని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ ఉంటారన్న చంద్రబాబు.. వైసీపీ(YCP) పతనం చోడవరం నుంచే ప్రారంభమైందని వెల్లడించారు. అంతే కాకుండా కష్టాల్లో ఉన్న వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి పెత్తనమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖను పూర్తిగా దోచేశారని వ్యాఖ్యానించారు. విశాఖను రాజధాని చేస్తామని చెప్పి, అక్కడ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదని అన్నారు. రోడ్ల గుంతల్లో మట్టి కూడా వేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధర పెంచారు కానీ.. రోడ్లపై గుంతలను మాత్రం పూడ్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరన్న చంద్రబాబు.. సాగునీరు పుష్కలంగా ఉండే కోనసీమలో కూడా క్రాప్‌హాలిడే ప్రకటించడాన్ని బట్టి వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటికైనా సీఎం వైఖరి మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు.
విద్యావ్యవస్థను నాశనం చేశారు. ఈ ముఖ్యమంత్రి ఉన్నంతవరకు ఎవరికీ ఉద్యోగాలు రావు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. మహానాడుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆటంకం కలిగించింది. టీడీపీ సభలను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదు. వైసీపీని ఇంటికి పంపించే సత్తా ఉత్తారాంధ్రకు ఉంది.
– చంద్రబాబునాయుడు, టీడీపీ అధినేత
సీఎం సొంత జిల్లా కడపలోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారన్న చంద్రబాబు.. అమ్మఒడి ఏమైందని ప్రశ్నించారు. టీచర్ల వ్యవస్థను సర్వ నాశనం చేశారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు రావని, పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఐటీ రంగాన్ని అభివృద్ది చేస్తే.. జగన్ సర్కార్ హయాంలో వాలంటీర్ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇదీ.. టీడీపీ – వైసీపీ పాలనకు ఉన్న తేడా అని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..