Andhra News: పెన్షన్లు, తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడు గంటలపాటు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. మహానాడు సహా 12 అంశాలపై సమావేశంలో చర్చించి... కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వితంతు పెన్షన్లు, మూడు గ్యాస్‌ సిలిండర్ల పథకం.. తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు.

Andhra News: పెన్షన్లు, తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Updated on: May 14, 2025 | 9:22 PM

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. ముందుగా ఆపరేషన్‌ సింధూర్‌కు మద్దతు తెలుపుతూ మోదీకి అభినందనలు తెలిపారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి, ఆపరేషన్‌ సింధూర్‌లో వీరమరణం పొందిన సైనికులకు సంతాపం తెలిపారు.16,17,18 తేదీల్లో నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించాల్సిన మహానాడుపై ప్రధానంగా చర్చించారు. తొలి రెండు రోజులు 23 వేల మందికి ఆహ్వానించాలని నిర్ణయించారు. చివరిరోజు గ్రామ అధ్యక్షుల వరకు 50వేల మందికి ఆహ్వానం పలకనున్నారు. కనీవిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహిస్తున్నట్లు పొలిట్‌బ్యూరో సభ్యులు వెల్లడించారు.

జూన్‌ 12 నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. మూడు గ్యాస్‌ సిలిండర్లకు ముందే డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే జూన్‌ 12న స్కూళ్లు తెరిచేలోపు తల్లికి వందనం అందేలా చూడాలన్నారు. కేంద్రం ఇన్‌స్టాల్‌మెంట్‌తో కలిపి అన్నదాత సుఖీభవ కూడా అందించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే మూడు టర్మ్‌లు మండలాధ్యక్షులుగా ఉన్నవారిని.. అదే పదవిలో కొనసాగించకూడదని సమావేశంలో నిర్ణయించారు. అర్హతని బట్టి ప్రమోషన్‌ ఉండాలని లేదంటే వేరే కమిటీలోకి తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్లు కూడా పొలిట్‌బ్యూరో సభ్యులు తెలిపారు.

పొలిట్‌బ్యూరో సమావేశానికి ముందు మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశమయ్యారు మంత్రి లోకేష్‌. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మహానాడుకు వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నేతలకు లోకేష్‌ దిశానిర్దేశం చేశారు.

ఇక మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో.. మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలు చేయనున్నారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్ మహానాడు, నియోజకవర్గ మహానాడు నిర్వహణపైనా సమావేశంలో చర్చించారు. మొత్తంగా… మహానాడు సహా 12 అంశాలపై చర్చించిన పొలిట్‌బ్యూరో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..