Andhra Pradesh: గన్నవరం అష్టదిగ్బంధనం.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్.. నిరాహార దీక్షకు దిగిన పట్టాభి భార్య..
గన్నవరం అష్టదిగ్బంధనమైంది. ఎటుచూసినా పోలీసులే చుట్టుముట్టారు. టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం నేపథ్యంలో.. గన్నవరానికి బయటివాళ్లు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.
గన్నవరం అష్టదిగ్బంధనమైంది. ఎటుచూసినా పోలీసులే చుట్టుముట్టారు. టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం నేపథ్యంలో.. గన్నవరానికి బయటివాళ్లు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. గన్నవరం శివార్లలో భారీగా మోహరించాయి పోలీసు బలగాలు. నూజివీడు, అగిరిపల్లి నుంచి గన్నవరం వచ్చే మార్గం దిగ్బంధించారు. కొన చెరువు దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు పోలీసులు. అటు ఏలూరు, గన్నవరం హైవే పై పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల నుంచి టిడిపి శ్రేణులు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే గన్నవరంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు.
కేసులకు భయపడేది లేదు..
ఇదిలాఉంటే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అవినీతిని బయటపెట్టడం తప్పా అని ప్రశ్నించారు టీడీపీ నాయకుడు బోండా ఉమా. ఆయనపై విచారణ జరిపించాల్సిన సీఎం జగన్.. తమపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. దాడులకు, కేసులకు భయపడేది లేదంటూ.. పోలీసులపైనా ఘాటు ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఆఫీస్‌పై దాడి చేసి, తమపైనే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు బోండా ఉమా. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పట్టాభిని ఏంచేశారో చెప్పడంలేదంటూ విమర్శించారు. రేపు అనేది ఒకటుందని గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు.
పోలీసులపై ఫైర్..
ఫ్యాక్షనిస్టు పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా వ్యాఖ్యానించారు. కొందరు పోలీసు అధికారులు ఉత్సవ విగ్రహాల్లో మారిపోయారని, మరికొందరు అధికారులు వైసీపీ కండువా వేసుకుని పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దాన్నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఈ రకంగా ప్రయత్నిస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్లకుండా భయపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పర్యటనలకు ప్రజలు హారతులు పడుతున్నారని, మళ్లీ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే అరాచకాలను ప్రశ్నించడం తప్పా?
గన్నవరం ఎమ్మెల్యే అరాచకాల్ని ప్రశ్నించడం తప్పా? అని బోండా ఉమ అన్నారు. ‘ఎమ్మెల్యే అవినీతిని వెలికితీయడం తప్పా? మా ఆఫీస్‌పై దాడికి సీఎం సమాధానం చెప్పాలి. భయపెట్టి, మా గొంతు నొక్కాలని చూస్తున్నారా? మీ పోలీసులను చూసి భయపడతాం అనుకుంటున్నారా? ఒక్క కార్యకర్త కూడా భయపడరు. ఎమ్మెల్యే అవినీతిపై విచారణ జరిపించి ఉండాల్సింది. అలా కాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. టీడీపీ పరిపాలనలో ఇలాంటి ఘటనలు జరిగాయా? ఒక్క వైసీపీ ఆఫీస్‌పైన కానీ, కేడర్‌పై కానీ.. చంద్రబాబు హయాంలో దాడులు జరిగాయా?’ అని ప్రశ్నించారు.
గన్నవరంలో దిగ్బంధాలు, హౌస్‌అరెస్టులు..
రాజకీయ ఉద్రిక్తత నేపథ్యంలో గన్నవరంలో పరిస్థితి ఒక్కసారిగా హీటెక్కాయి. టీడీపీ నాయకుల హౌస్ అరెస్టులతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరెస్ట్‌తో నాగాయలంకలో ఉద్రిక్తత నెలకొంది. పచ్చి మంచినీళ్లు కూడా మట్టనంటూ పీఎస్‌లో బోడె ప్రసాద్ దీక్షకు దిగారు. బోడె ప్రసాద్‌కు మద్దతుగా నాగాలయంక పీఎస్‌కు బుద్ధప్రసాద్ చేరుకున్నారు. గొల్లపూడిలో బోండా ఉమాను గృహ నిర్బంధం చేశారు. మరోవైపు ఉమా ఇంటి దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య లను గృహ నిర్బంధం చేశారు.
పోలీసులకు పట్టాభి భార్య అల్టీమేటం..
ఇదిలాఉంటే.. పట్టాభి భార్య చందన పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. తన భర్తను ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అరగంటలో స్పష్టమైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు చందన. తన కూతురు రాత్రి నుంచి భయంభయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు చందన. తన భర్త జాడ చెప్పకపోతే.. ఎట్టి పరిస్థితుల్లో డీజీపీ ఇంటికి వెళ్తానంటున్నారు పట్టాభి భార్య చందన.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..