అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా సీట్ల పంపకాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. టీడీపీ- జనసేనతో పొత్తుపై బీజేపీ గురువారం నిర్ణయం తీసుకోనుంది. దానిలో భాగంగా.. బీజేపీ హైకమాండ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రావాలన్న సూచనతో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చినట్లు సమాచారం.. దీంతో పవన్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి హుటాహుటిన కార్యక్రమం ముగించుకుని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే, గురువారం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు కలిసి బీజేపీ పెద్దలలో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీ టూర్‌లో భాగంగా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై అమిత్‌షాతో చర్చించనున్నారు. పొత్తులపై ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలను ఆరా తీసిన అమిత్ షా.. పొత్తు అవసరాలు, పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే.. మూడు పార్టీలకు మేలు జరిగేలా పొత్తులు ఉండేలా.. బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతోనే చంద్రబాబు.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కు ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కీలకంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకాలు.. రాజకీయ అంశాల గురించి చర్చకు వచ్చే అవకాశముందని సమచారం..
కాగా.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ ఎంపీ ఇంటికి వెళ్లారు. అక్కడే టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీ నుంచి బయటికి వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా చంద్రబాబు ఉన్న ఇంటికి వచ్చి భేటీ అయ్యారు. ఎంపీ లావు టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్న నేపధ్యంలో .. తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..