Chandrababu Naidu: దేవతలారా దీవించండి.. శత చండీయాగం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు..

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండీయాగం చేస్తున్నారు. దేవతలారా దీవించండి అంటూ వాళ్ల ఆశీర్వాదం కోరుకుంటున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మొదటి రోజు యాగాలు కొనసాగాయి. మూడు రోజులపాటు ప్రత్యేక హోమాలు, పూజలు చేయనున్నారు చంద్రబాబు దంపతులు.

Chandrababu Naidu: దేవతలారా దీవించండి.. శత చండీయాగం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు..
Chandrababu Naidu

Updated on: Dec 22, 2023 | 8:53 PM

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండీయాగం చేస్తున్నారు. దేవతలారా దీవించండి అంటూ వాళ్ల ఆశీర్వాదం కోరుకుంటున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మొదటి రోజు యాగాలు కొనసాగాయి. మూడు రోజులపాటు ప్రత్యేక హోమాలు, పూజలు చేయనున్నారు చంద్రబాబు దంపతులు. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమంతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. చంద్రబాబు దంపతులు చేస్తున్న యాగానికి పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి.. హోమం నిర్వహించడమే చండీ హోమం. గ్రహాల అనుకూలతకు, భయభీతి పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి చండీ యాగం చేస్తారు. ఇలా ఎన్నో రకాలుగా తమకు కలిసి రావడానికి ఈ యాగం చేస్తారు. ఈమధ్య కాలంలో రాజకీయ నాయకులు ఈ యజ్ఞయాగాలు ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబు ఈ యాగం చేయడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.

ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌.. యాగాలకు పెట్టింది పేరు. ఆయన చాలాసార్లు యజ్ఞయాగాలు నిర్వహించారు. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన యాగం చేశారు. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించారు. నర్తనకాళి అవతారంలో ఉన్న రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో ఈ యాగ క్రతువులు జరిగాయి.

ఇక తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా.. ఎన్నికలకు ముందు కొడంగల్‌లోని తన నివాసంలో మూడు రోజుల పాటు చండీయాగం నిర్వహించారు. కుటుంబ సమేతంగా గత సెప్టెంబర్‌లో ఆయన ఈ యాగంలో పాల్గొన్నారు.

ఇక కొద్ది నెలల క్రితం ఏపీ సీఎం జగన్‌ కూడా ఆరు రోజుల పాటు రాజ శ్యామల యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ కనీవినీ ఎరుగని అతిపెద్ద ధార్మిక మహా యాగం చేశారు. ఏపీలో అంతకుముందెన్నడు చేయని అతి పెద్ద కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ నిర్వహించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహాయజ్ఞం నిర్వహించారు. విజయవాడ దుర్గమ్మ పాదాల చెంత….గలగలా పారే కృష్ణమ్మ తీరంలో రాజశ్యామల మహా యాగ క్రతువు జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ మహా యజ్ఞం జరిగింది. నాలుగు ఆగమ శాస్త్రాలకు ప్రతీకగా నాలుగు యాగశాలల్లో 108 హోమగుండాలు ఏర్పాటు చేసి, 550మంది రుత్విక్కులతో నిర్వహించిన ఈ యాగం అప్పట్లో టాక్ ఆఫ్‌ ది స్టేట్‌గా మారింది.

నమ్మకాలు విశ్వాసాల సంగతి ఎట్లా ఉన్నా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాగాలు, రాజకీయ యోగాలపైనే చర్చ జరుగుతోంది. నాయకుల గాలి కూడా అటే వీస్తోంది. తాజాగా చంద్రబాబు – చండీ యాగం…తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..