యువగళం పాదయాత్రలో తీవ్రమైన గుండెపోటుకు గురైన తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించాలని నిర్ణయించారు. అయితే ఎయిర్ లిఫ్ట్ చేయాలా..లేక రోడ్డు మార్గంలో తీసుకెళ్లాలా అనేది ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పారు బాలకృష్ణ. ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నారని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఆయన కుడి, ఎడమ రక్తనాళాల్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక తారకరత్న ఆరోగ్యంపై దగ్గరుండి ఆరాతీస్తున్నారు బాలకృష్ణ. అటు చంద్రబాబు వైద్యులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం హెల్త్ కండీషన్ స్టేబుల్‌గా ఉందని చెబుతున్నారు టీడీపీ నేతలు.
లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు తారకరత్న. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లోనూ లోకేష్ వెంటే ఉన్నారు. కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్నారు . కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తోసుకుని వచ్చారు. ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు తారకరత్న. వెంటనే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ హాస్పటల్‌కు తీసుకెళ్లారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తోంది.
గురువారం హిందూపురం పర్యటనలోనూ బాలకృష్ణ వెంట ఉన్నారు తారకరత్న. టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. బాలకృష్ణతోపాటు ఉల్లాసంగా గడిపారు తారకరత్న. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వచ్చారు.