పవిత్ర పుణ్యక్షేత్రం సమీపంలో తబ్లిక్ ఇస్తేమా కార్యక్రమం.. హిందూ సంఘాల తీవ్ర అభ్యంతరం..!
కరోనా టైమ్‌లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన తబ్లిగీ జామాత్.. మరోసారి చర్చనీయాంశమయింది. గతంలో వివాదానికి ఢిల్లీ వేదికగా నిలవగా..ఈ సారి తిరుపతి కేంద్రమయింది. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి, హిందూ చైతన్య ఐక్య వేదిక, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వంటి సంస్థలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. అసలేం జరిగింది..? లేటెస్ట్‌గా తెరపైకి వచ్చిన వివాదం ఏంటి..?

తిరుపతిలోని అగరాల దగ్గర సెప్టెంబర్ 13,14 తేదీల్లో తబ్లిక్ ఇస్తేమా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఈ కార్యక్రమంపై హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దంటున్నాయి హిందూ సంఘాలు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ సనాతన ధర్మ పరిరక్షణ సమితి, హిందూ చైతన్య ఐక్య వేదిక, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వంటి సంస్థలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి.
హిందువులకు పవిత్రమైన తిరుపతిలో తబ్లిక్ ఇస్తేమా వంటి కార్యక్రమం సరికాదన్నారు.. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద. త్వరలో బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వడాన్ని హిందూ సంఘాలంతా ఖండిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల్లోనే నిషేధించిన ఇలాంటి సంస్థల కార్యక్రమాలకు ఏపీలో ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టి సారించి ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. హిందూ సంఘాల అభ్యంతరంపై ఏపీ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
