విజయనగరం జిల్లా, రేగిడి మండలం, ఉంగరాడలో విషాదం చోటుచేసుకుంది.. ఆరు నెలల గర్భిణి మహిళ ధనలక్ష్మి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. జోడుంబందలకు చెందిన గణపతి, రాములమ్మ కుమార్తె ధనలక్ష్మి.. గతేడాది సెప్టంబర్ లో ఉంగరాడకు చెందిన గౌరినాయుడికి ఇచ్చి వివాహం చేశారు తల్లిదండ్రులు. రెండు నెలలు బాగానే ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. సూటిపోటి మాటలతో ఇబ్బందులు పెట్టేవారు. అత్తగారింట్లో ధనలక్ష్మి పడుతున్న కష్టాలు ఎప్పటికప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధ పడేది.. ధనలక్ష్మి. వారు కూడా సర్దుకోమని చెబుతుండేవారు. ఇలా పెళ్లయ్యి ఆరునెలలు గడిచాయి. ధనలక్ష్మి కూడా గర్భవతి అయ్యింది. ఇదిలా జరుగుతుండగానే.. ఈ నెల 25న ధనలక్ష్మి తన స్నేహితురాలితో కలిసి.. పక్కనే ఉన్న రాజాంకి షాపింగ్ కోసం వెళ్లింది. సాయంత్రం ఇంటికొచ్చిన భర్త ఆమెను నిలదీశాడు.
తనకు చెప్పకుండా ఎందుకెళ్లావంటూ.. ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన భర్త అత్తమామలు తనను చంపేస్తున్నారంటూ తల్లిదండ్రులకు చెప్పి ప్రాధేయపడింది. కొద్దిసేపటి తర్వాత భర్త పని మీద బయటకు వెళ్లి రాత్రి అక్కడే ఉండిపోయాడు. తెల్లవారిన తర్వాత కూడా ఇంటి తలుపులు ఎంతకీ తీయకపోవడంతో.. ఈ విషయం గమనించిన అత్త.. స్థానికులకు తెలియ చేసింది. అందరూ కలసి.. తలుపులు తెరిచే సరికి.. ధనలక్ష్మి ఉరి వేసుకుని మృతి చెంది కనిపించింది. స్థానికుల సమాచారంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆ ఊరికి తరలివచ్చారు.
ధనలక్ష్మిని అత్తా మామలే.. హతమార్చారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ధనలక్ష్మి మృతితో భర్త అత్తమామలు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరికోసం గాలింపు మొదలు పెట్టారు. ఎట్టకేలకు వారే లొంగిపోయారు. ధనలక్ష్మిది హత్యా, ఆత్మహత్యా పోలీసు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..