‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
‘ఓటుకు కోట్లు’ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని...

‘ఓటుకు కోట్లు’ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. వేసవి సెలవుల తర్వాత దీనిని విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఖచ్చితమైన విచారణ తేదీని నిర్ణయించాలని ప్రశాంత్ భూషణ్ కోర్టును కోరగా, తమ లిఖిత పూర్వక ఆదేశాల్లో ఇస్తామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు.
ఓటుకు కోట్లు కేసు ఛార్జ్ షీట్‌లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. అయినా చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చలేదని పిటిషనర్ తరపున న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు. కాగా, రాజకీయ నేతల కేసులను త్వరగా విచారణ జరపాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
