Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..!
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు స్టార్ట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇవాళ్టి నుంచి జూన్ 10వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు స్టార్ట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇవాళ్టి నుంచి జూన్ 10వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్ 13న ప్రారంభం కానున్నాయి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆదేశాలతో, సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు, వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. వెకేషన్ కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, సెలవులు పూర్తయ్యేంత వరకు వేచి చూడలేని అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాలని స్పష్టం చేసింది హైకోర్టు. మొదటి దశ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథరావు, జస్టిస్ తర్లాడ రాజశేఖర్, జస్టిస్ చీమలపాటి రవి ఉండనున్నారు. ఇందులో జస్టిస్ మన్మథరావు, జస్టిస్ రాజశేఖర్ ధర్మాసనంలో, జస్టిస్ చీమలపాటి రవి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. రెండో వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉంటారు. వీరిలో జస్టిస్ దుర్గా ప్రసాదరావు, జస్టిస్ కృష్ణమోహన్‌లు ధర్మాసనంలో, జస్టిస్ వెంకటేశ్వర్లు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏవీ రవీంద్రబాబు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. వ్యాజ్యాలు వేయాలనుకునేవారు, ఈ విషయాన్ని గమనించాలని సూచించారు రిజిస్ట్రార్. జూన్ 13 నుంచి మళ్లీ యథావిధిగా కోర్టు కార్యకలాపాలు జరగనున్నాయి.