AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుపాను.. మరో 24 గంటల్లో తీరానికి దగ్గరగా వస్తుందంటున్న ఐఎండీ..

ఆగ్నేయ బంగాళ ఖాతంలో ఏర్పడ్డ అసని తుపాను కొనసాగుతోంది. ఇది తీవ్ర తుపానుగా మారి పదో తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. తర్వాత అసనీ తన దిశ..

Cyclone Asani: ముంచుకొస్తున్న అసని తుపాను..  మరో 24 గంటల్లో తీరానికి దగ్గరగా వస్తుందంటున్న ఐఎండీ..
Cyclone Asani
Sanjay Kasula
|

Updated on: May 09, 2022 | 7:19 AM

Share

ఆగ్నేయ బంగాళ ఖాతంలో ఏర్పడ్డ అసని తుపాను(Cyclone Asani) కొనసాగుతోంది. ఇది తీవ్ర తుపానుగా మారి పదో తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వస్తుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. తర్వాత అసనీ తన దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళా ఖాతంలో ఒడిశా తీరానికి చేరే అవకాశముండని భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. ఉత్తర కోస్తాంధ్రపై అసని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణంగా మే నెలలో తుపాన్లు తీరానికి దగ్గర గా వచ్చినప్పటికి తీరం దాటడం అరుదు. ఇవి నేరుగా తీరం వైపు వచ్చి దిశ మార్చుకుని వెళ్లిపోతుంటాయని అంటున్నారు నిపుణులు.

ఆదివారం నాటికి విశాఖకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో అసని తుపాను కేంద్రీకృతమైంది. ఈ తుపాను ప్రభావంతో 10, 11 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్రలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంద్రలో కూడా ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసేలా తెలుస్తోంది.

విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం- మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు తుపాను హెచ్చరికలు పంపింది. ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంటోంది విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం.

బంగాళాఖాతం మధ్యలో ప్రస్తుతానికి గంటకు 115- 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా.. తుపాను తీరానికి దగ్గరగా వస్తున్న కొద్దీ తీవ్రత తగ్గొచ్చు. ఆ సమయానికి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీయవచ్చని తెలిపింది.

తీవ్ర తుపానుగా మారిన కారణంగా మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. తుపాను వల్ల 9, 10, 11, 12 తేదీల్లో సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా 10, 11 తేదీల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తోంది.