యూజ్ చేయడానికి ప్లాస్టిక్ ఎంత కన్వినియంటో దాన్ని వదిలించుకోవడం అంత కష్టం. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంతటి పెనుముప్పుగా మారిందో మన కళ్లెదుటే కనిపిస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని, తగ్గించుకోవాలని ప్రభుత్వాలు ఎంతగా చెప్తున్నా వదిలించుకోలేని పరిస్థితి. మన జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగంగా మారింది. మట్టిలో ప్లాస్టిక్ కలిసి పోవాలంటే వందల ఏళ్లు పడుతుంది. అందుకే ఏ చెత్త కుప్ప దగ్గర చూసినా ప్లాస్టికే కనిపిస్తుంది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారులతో కలిసి కీలక నిర్ణయం తీసుకుంది.
ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించగా.. ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేసేలా అధికారులు నిర్ణయించారు. షేదాజ్ఞలు పాటించని వారిపై జరిమానా విధించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్లాస్టిక్ నిషేధానికి స్వచ్చందంగా సహకరించాలని అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం ఈఓ పెద్దిరాజు స్దానికులను భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై స్దానిక అటవీశాఖ సైన్స్ ల్యాబ్‌లో అధికారులతో స్దానిక వ్యాపారస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
శ్రీశైలంలో ఇప్పటికే గత పదిరోజులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేదించారు. వాటర్ బాటిళ్ల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. శ్రీశైలంలో పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడాలాని, అడవి జంతువుల రక్షణకు అందరు సహకరించాలని ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం అధికారులను వ్యాపారస్తును కోరారు. ఇప్పటికే పలు కంపెనీల వాటర్ బాటిళ్లను క్షేత్రంలోని షాపుల్లో అమ్మకాలు నిలిపివేశారు. మే ఒకటవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో శ్రీశైలం మండలం మొత్తంలో కూడా ప్లాస్టిక్ వాటర్ బాట్లను అమ్మకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న వాటర్ బాటిళ్ల స్టాక్ మాత్రమే సేల్ చేసుకోవాలని సూచించారు అధికారులు. ఇక నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను శ్రీశైల క్షేత్ర పరిధిలోకి అనుమతించమని తేల్చి చెప్పారు.
శ్రీశైలం క్షేత్ర పరిధిలో పూర్తిగా మే ఒకటి నుంచి ప్లాస్టిక్ వస్తువులను నిషేదిస్తున్నట్లు ఈఓ పెద్దిరాజు స్పష్టం చేశారు. భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్కటిగా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి నిషేదిస్తామని వెల్లడించారు. ఇక నుంచి వాటర్ బాటిళ్లను గాజు సీసాలలో మాత్రమే వినియోగంచేందుకు చర్యలు తీసుకున్నామని ఈవో పెద్దిరాజు తెలిపారు. శ్రీశైలం నల్లమల అడవులలో ఉండటంతో అడవి జంతువులకు వన్యప్రాణులకు ప్లాస్టిక్ వస్తువుల వల్ల హాని కలుగుతుందని, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…