Krishna River: ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం కృష్ణా నదికి పోటెత్తుతోంది. దాంతో నది ప్రవాహం ఉధృతంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం కృష్ణా నదికి పోటెత్తుతోంది. దాంతో నది ప్రవాహం ఉధృతంగా మారింది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర జలాశయానికి వరద నీరు ప్రవాహం భారీగా పెరిగింది. దాంతో జలాశయం పూర్తిగా నిండిపోయింది. అలర్ట్ అయిన అధికారులు.. ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 55,888 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 57,294 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1632.87 అడుగులుగా ఉంది. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 105.266 టీఎంసీలు ఉంది.
శ్రీశైలం 10 గేట్లు ఎత్తివేత..
ఇక శ్రీశైలం జలాశయానికి కూడా వరద నీరు పోటెత్తుతోంది. వరద ప్రవాహం భారీగా ఉండటంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. వరద కంటిన్యూ అవుతుండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. 10 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపు ఉరకలేస్తోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,60,802 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 3,85,809 క్యూసెక్కులు వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగులగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. కాగా, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తడం ఏడాది ఇది ఆరవ సారి కావడం విశేషం.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి పెరిగిన వరద ఉధృతి..
ఎగువ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఆ వరద ఉధృతి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగిలింది. జలాశయం నిండుకుండలా మారగా.. వరద నీటిని 18 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుల ఇన్ ఫ్లో 3,85,809 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,11,377 క్యూసెక్కులు. జలాశయం పూర్తిస్దాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 589.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు అయితే, ప్రస్తుతం ప్రస్తుతం :310.5510 టీఎంసీలు ఉంది.
కనువిందు చేస్తున్న వాటర్ ఫాల్స్..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి నంద్యాల జిల్లా అవుకు మండలం మంగంపేట కొండల మధ్య జలపాతం తుంపర్లు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. కొండల మధ్య నుంచి భారీ శబ్దంతో జెట్ స్పీడ్ తో దిగువకు దూకుతున్న జలపాతం అబ్బుర పరుస్తోంది. తాగునీటికి సాగునీటికి కటకట ఉండే ప్రాంతంలో జలపాతంలా వరద రాడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే జలపాతం కారణంగా దిగువన ఉన్న పంట పొలాలు మొత్తం నీటి మునిగాయి. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..