కన్నకొడుకే కాలయముడయ్యాడు. తండ్రి అన్న మమకారం కూడా లేకుండా కిరాతకంగా హతమార్చాడు. అడ్డుపడ్డ సవితి తల్లిని కూడా దారుణంగా హత్యచేసి భయానక వాతావరణాన్ని సృష్టించాడు. విజయనగరం జిల్లా బొండపల్లి దళితవాడలో జరిగిన ఈ జంట హత్యల ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న డోల రామును అతని భార్య కొన్నేళ్ల క్రితం వదిలి వెళ్ళిపోయింది. వారి పెద్ద కొడుకు పైడిరాజు విశాఖలోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు డోల లక్ష్మణ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తండ్రి డోల రాము గట్టుపల్లి గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో కొడుకు లక్ష్మణ ఇంట్లో నుండి బయటకు వచ్చి వాళ్ల పక్కింట్లోనే ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. అయితే తండ్రి ఉంటున్న ఇంటి ముందుకు కుళాయి నీరు వస్తుంటాయి. అలా వచ్చే కుళాయి నీరు తనకు కూడా ఇవ్వాలని చాలాసార్లు తండ్రిని కోరాడు లక్ష్మణ. తండ్రి మాత్రం కుళాయి నీరు ఇచ్చేందుకు నిరాకరించేవాడు.
ఈ విషయంలోనే అనేకసార్లు తండ్రీ కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కుళాయి నీరు రాగానే లక్ష్మణ్ కుళాయి వద్దకి వెళ్ళటం, తండ్రి అందుకు నిరాకరించడంతో ఇరువురి మధ్య మరోసారి చిన్నపాటి గొడవ జరిగింది. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద కొట్లాటకు దారి తీసింది. దీంతో లక్ష్మణ పట్టరాని కోపంతో ఇంట్లో ఉన్న కత్తిని తీసుకు వచ్చి తండ్రిపై దాడికి దిగాడు. విచక్షణారహితంగా కొట్టి కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సవితి తల్లి జయలక్ష్మి లక్ష్మణను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆవేశంలో ఉన్న లక్ష్మణ సవితితల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో తండ్రి రాము, తల్లి జయలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇద్దరు మరణించిన తరువాత అక్కడ నుండి పరారయ్యాడు నిందితుడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి గంటల వ్యవధిలో నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.
అయితే డోల రాము, జయలక్ష్మిలకు చంద్రిక అనే ఒక కుమార్తె ఉంది. చంద్రిక ఎనిమిదో తరగతి చదువుతుంది. బాలిక పాఠశాలకి వెళ్ళిన సమయంలో ఈ హత్యలు జరిగాయి. స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో చంద్రిక తన తల్లిదండ్రుల మృతదేహాలు చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఉదయం పాఠశాలకి వెళ్లానని తనకేం జరిగిందో తెలియదని, హత్య చేసిన తన సోదరుడు లక్ష్మణను కటినంగా శిక్షించాలని పోలీసులను వేడుకోవడం అందరినీ కలిచి వేసింది. తల్లిదండ్రుల మరణంతో చిన్నారి చంద్రిక అనాధగా మారింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే బొండపల్లి ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యలు జిల్లాలో సంచలనంగా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..