ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో మతిస్థిమితం లేని తల్లి వెంకట రత్నం (52) పై మానసిక వికలాంగుడైన కుమారుడు లక్ష్మయ్య (25) గొడ్డలితో దాడి చేశారు. కుమారుడి దాడిలో తల్లి వెంకటరత్నం గొంతుపై బలమైన గాయం అయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమెకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.
గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కుటుంబంలోని.. తల్లి, కూతురు, కుమారుడు ముగ్గురూ మానసిక వికలాంగులు. కుమారుడు ఎక్కడ తప్పిపోతాడేమోనన్న భయంతో అతను బయటికి వెళ్లినప్పుడల్లా తల్లి అతన్ని వెంబడిస్తూ ఉండేది. దీంతో నీకు పెళ్లి కాదంటూ స్నేహితులు అతన్ని హేళన చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో శనివారం కోపొద్రిక్తుడైన లక్ష్మయ్య ఇంటికి వెళ్లి గొడ్డలితో తల్లిపై దాడిచేశాడు.
అనంతరం రక్తపు మరకులున్న దుస్తులతో బజారుకి వెళ్లాడు.. ఈ సమయంలో అతన్ని చూసిన స్నేహితులు ఏం జరిగిందని ప్రశ్నించారు. కోడిని చంపానంటూ వారితో లక్ష్మయ్య అబద్ధం చెప్పాడు. ఈ క్రమంలో.. గుట్కా ప్యాకెట్ ఇస్తే అసలు నిజం చెప్తానంటూ లక్ష్మయ్య వారితో పేర్కొన్నాడు. గుట్కా ప్యాకెట్ ఇచ్చిన తర్వాత లక్ష్మయ్య జరిగిన విషయాన్ని స్నేహితులకు చెప్పాడు.
సమాచారం అందుకున్న గ్రామస్తులు హుటాహుటిన లక్ష్మయ్య ఇంటికి వెళ్లారు. అనంతరం అపస్మారక స్ధితిలో ఉన్న వెంకటరత్నంను చికిత్స నిమిత్తం 108 వాహనంలో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..