Kurnool Bus Fire: కర్నూలు బస్సు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనూష రెడ్డి సజీవ దహనం

శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాద మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది వరకు ప్రయాణికులు మరణించినట్టు తెలుస్తోంది. మృతుల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనూష రెడ్డి సహా ఆరుగురితో పాటు పలువురు ఏపీకి చెందిన పలువురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన పలువురు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

Kurnool Bus Fire: కర్నూలు బస్సు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనూష రెడ్డి సజీవ దహనం
Anusha Reddy

Updated on: Oct 24, 2025 | 3:08 PM

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనూష రెడ్డి సజీవ దహనమైంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె దీపావళి పండుగకు సొంతూరు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లాకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ధాత్రి కూడా మృతి చెందింది. అనూష మరణంతో ఆమె స్వగ్రామం వస్తకొండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ప్రమాదం సమయంలో బస్సులో మొతం 13 మంది తెలంగాణకు చెందిన ప్రయాణికులు ఉండగా వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

మృతుల్లో నెల్లూరు జిల్లాకు చెందిన కుటుంబం

ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లల సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేశ్‌ (35), అనూష (30), మన్విత (10), మనీశ్‌ (12)గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయానిస్తుండగా ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. గాయపడిన వారిలో ఏడుగురు హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌గా కాగా ప్రస్తుతం నలుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

బస్సు ఢీకొట్టిన బైకర్ మృతి

మరోవైపు ఈ ప్రమాద సమయంలో బస్సు ఢీకొట్టి బైకర్‌ శివశంకర్‌ కూడా దుర్మరణం చెందాడు. అతని బైక్‌ను ఢీకొనడంతోనే బస్సులో మంటలు చెలరేగి విపరీతంగా వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న దాదాపు 20 మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎక్స్‌గ్రేషియా

అయితే ఈ విషాదకరణ ఘటనపై కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ప్రమాద బాధితులకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాయి. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించగా.. ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు గాయపడిన వారికి రూ.2లక్షల చోప్పున పరిహారం ప్రకటించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.