Simhachalam Temple Priests Controversy: సింహాచలం అప్పన్న సన్నిధిలో ఆధిపత్యపోరు ముదిరిపాకానపడింది. ఎంత ముదిరిందీ అంటే.. ఒక వర్గం అర్చుకులు ఆలపించిన గీతాలాపనను మరో వర్గం మార్ఫింగ్‌తో మాయ చేసినట్లు తెలుస్తోంది. దేవుడు పాటలు పాడితే.. వాటిని కాస్తా అన్యమత గీతాలుగా, వీధి పాటలుగా మార్చేసి వీడియోలు వైరల్ చేసింది మరోవర్గం.
అప్పన్న సన్నిధానం అన్న విషయం మర్చిపోయారు. ఆలయ ప్రతిష్టను వదిలేశారు. కేవలం ఆధిపత్యపోరుతో నానాయాగీ చేసుకుంటున్న సీన్ ప్రస్తుతం సింహాచలంలో కనిపిస్తోంది. వాస్తవానికి మూడు రోజుల క్రితం గుడిలో నారసింహ గరుడోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో నాగసింహ గర్జనలను సీతారాం అనే అర్చకులు ఆలపించారు. ఆ ఆడియోను మరో ఇద్దరు అర్చకులు మార్ఫింగ్ చేశారు. గర్జనలను కాస్తా మరో మతం గీతాలు పలికించారు. వీధిపాటలు పాడుతున్నారంటూ వెరైటీగా చిత్రీకరించి వైరల్ చేశారు.
ఒక గుడిలో ఇలా జరిగిందీ అంటే ఇక వీడియో వైరల్ కాకుండా ఎలా ఉంటుంది. మార్ఫింగ్ అయిన ఆ వీడియో, ఆడియో చూసిన వ్యతిరేక వర్గం రచ్చ రచ్చ అవుతోంది. ఎంత కోపం ఉంటే ఇలా దుష్ప్రచారాలు చేస్తారు.. ఇదెక్కడి ఆధిపత్య పోరు అంటూ గగ్గోలు పెడుతోంది మరో వర్గం. పరిస్థితి చేజారుతుండడంతో.. ఆలయ ఈవో సూర్యకళ స్థానాచార్యులు, అర్చకులతో సమావేశం నిర్వహించారు. పూజారుల మధ్య సఖ్యతకు ప్రయత్నించారు.
ఒక వీడియో, ఆడియో. రెండు వర్గాలు. ఆధిపత్యపోరు లేదంటూనే తలోమాట. చినికి చినికి గాలివానగా మారుతున్న ఈ తంతగంలో అసలు మార్ఫింగ్ చేసిందెవరు? నిజంగా జరిగిందా? బాధ్యులపై చర్యలేంటి.. అసలు గొడవకు కారణమేంటి.. వీటన్నింటికి చెక్ పెట్టాలన వేద పండితులు డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలతో పరువు తీస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.