AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakasam District: చిన్న కథ కాదురా సామి మీతో.. రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే

ప్రకాశం జిల్లా చింతాయగారిపాలెం వద్ద అర్ధరాత్రి రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చినట్లు అనుమానించిన వ్యక్తిని ఆక్వా రైతులు పట్టుకున్నారు. అయితే నిందితుడిని నిర్బంధించారంటూ రైతులపైనే కౌంటర్‌ ఫిర్యాదు నమోదు కావడంతో ఘటన ఉద్రిక్తంగా మారింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చోరీల ముఠాను గుర్తించాలని రైతులు పోలీసులను కోరుతున్నారు.

Prakasam District: చిన్న కథ కాదురా సామి మీతో.. రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
Chintayagaripalem
Fairoz Baig
| Edited By: |

Updated on: Jun 21, 2026 | 7:58 PM

Share

అర్ధరాత్రి ఒంటిగంట సమయం. ఓ ఆటో వేగంగా వచ్చి రొయ్యల చెరువుల సమీపంలో ఆగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆక్వా రైతులకు అనుమానం రావడంతో ఆటోలో ఉన్న వారిని ఈ సమయంలో ఇక్కడ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు వ్యక్తులు రైతులతో వాగ్వాదానికి దిగారు. వారి వద్ద కత్తులు, బ్లేడ్లు, వలలు ఉండటాన్ని గమనించిన రైతులు, రొయ్యల చెరువుల్లో చోరీ చేసేందుకు వచ్చారని అనుమానించారు. వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఆటోతో పాటు నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఒకరిని రైతులు అదుపులోకి తీసుకుని నిర్బంధించారు.

ఈ ఘటన చింతాయగారిపాలెంలోని రొయ్యల చెరువుల వద్ద చోటుచేసుకుంది. పట్టుబడిన వ్యక్తిని ఎక్కడి నుంచి వచ్చారు? మీ వెనుక ఎవరున్నారు? ఎంతకాలంగా ఈ చోరీలకు పాల్పడుతున్నారు? అంటూ రైతులు ప్రశ్నించారు. ఉదయం పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడి అనుచరులుగా భావిస్తున్న సుమారు 15 మంది రైతుల వద్దకు చేరుకుని, పట్టుకున్న వ్యక్తిని విడిచిపెట్టాలని కోరారు. రైతులు నిరాకరించడంతో, వారిపైనే కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది.

ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనను పోలీసులకు వివరించారు. రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చిన వ్యక్తినే పట్టుకున్నామని, అతడిని పోలీసులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు పోలీసులు సూచనలు చేశారు. చోరీకి పాల్పడుతున్నట్లు అనుమానించిన వారిని స్వయంగా నిర్బంధించి ప్రశ్నించే బదులు, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించాలని సూచించారు.

అయితే, రొయ్యలను అపహరించేందుకు వచ్చి తమపైనే కౌంటర్‌ ఫిర్యాదు చేయడం ఆందోళనకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే తరహాలో రొయ్యల చెరువుల్లో చోరీలు, రైతులపై దాడుల ఘటనలు జరిగినట్లు పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి అసలు ముఠాను గుర్తించాలని పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటన స్థానిక ఆక్వా రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Follow Us