Sea Level Rise: అంతర్వేదిలో సముద్రం ఉగ్రరూపం.. 45 మీటర్ల మేర ముందుకు.. ఆందోళనలో గ్రామస్థులు
Sea Level Rise: తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం రోజురోజుకు ముందుకు రావడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం..
Sea Level Rise: తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం రోజురోజుకు ముందుకు రావడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు వచ్చే సముద్రం .. గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకు రావడంపై గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, సముద్ర కెరటాల ఉద్ధృతికి ఒక రెస్టారెంటు, రెండు కూల్ డ్రింక్ షాపులు ధ్వంసం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా ఇలా సముద్రం ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, బంగాళాఖాత సముద్రం గోదావరి నది సంగమ ప్రాంతం అంతర్వేది. సఖినేటి పల్లిలోని పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేది. ఈ త్రికోణాకారపు దీవిపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువై భక్తులతో పూజలను అందుకుంటాడు. తాజాగా అంతర్వేది సముద్ర తీరం దగ్గర ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అంతర్వేది బీచ్‌లో సముద్రం ఉన్నట్టుండి ముందుకు చొచ్చుకు వచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకొచ్చి దాదాపు తీరమంతా మునిగిపోయి నీరే కనిపిస్తోంది.
అయితే గత వారం రోజుల కిందట కూడా సముద్రం 25 మీటర్ల మేర ముందుకొచ్చింది. అప్పటి నుంచి స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు సముద్రం 45 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. అటు అలల తాకిడితో అక్కడే ఉన్న రెసిడెన్షియల్ భవనం ధ్వంసమైంది. అలల ఉధృతికి కింద నేలంతా కొట్టుకుపోవడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇలా సముద్రం ముందుకు రావడం 20 ఏళ్ల కోసారి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇక జిల్లాలోని ఉప్పాడ తీరం వెంబడి సముద్రం వెనక్కి వెళ్లింది. స్వల్ప అలలతో ఉన్న సముద్రం భారీగా నీటి మట్టం తగ్గిపోయింది.