‘మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం..’ అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే రూ.72లక్షలు హాంఫట్..!

'పేలుడు జరిగిన ప్రాంతంలో మీ ఏటీఎం కార్డు ఉంది. మర్యాదగా ఒప్పుకో.. లేకపోతే అరెస్టు చేస్తాం' అంటూ బెదిరించారు. అదేవిధంగా కేసు నుంచి బయట పడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా పంపాలన్నారు.

'మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం..' అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే రూ.72లక్షలు హాంఫట్..!
Cybercriminals
Follow us
Nalluri Naresh

| Edited By: Balaraju Goud

Updated on: Oct 30, 2024 | 7:49 PM

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. ఏకంగా రూ. 72 లక్షలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో ఓ రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ పెట్టారు. బ్యాంకు ఖాతాలో నుంచి ఏకంగా రూ. 72 లక్షలు స్వాహా చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లా గుత్తిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన రైల్వే ఉద్యోగికి నాలుగు రోజుల క్రితం ఫోన్ వచ్చింది. ‘మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం… ఇటీవల ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ళలో నువ్వెందుకు ఉన్నావు’ అంటూ అవతలి వైపు నుంచి గద్గద స్వరంతో రైల్వే ఉద్యోగికి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ బ్యాక్ గ్రౌండ్ లో అచ్చం ఒక క్రైమ్ బ్రాంచ్ ఆఫీసు ఎలా ఉంటుందో.. అలాగే వీడియో కాల్ లో హడావుడి సృష్టించారు. దీంతో భయపడిన ఆ రైల్వే ఉద్యోగి తాను ముంబైకే వెళ్ల లేదని చెప్పగా సైబర్ నేరగాళ్లు రైల్వే ఉద్యోగిని దబాయించారు.

అంతటితో ఆగని కేటుగాళ్లు, ‘పేలుడు జరిగిన ప్రాంతంలో మీ ఏటీఎం కార్డు ఉంది. మర్యాదగా ఒప్పుకో.. లేకపోతే అరెస్టు చేస్తాం’ అంటూ బెదిరించారు. అదేవిధంగా కేసు నుంచి బయట పడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా పంపాలన్నారు. దీంతో ఆ రైల్వే ఉద్యోగి మొదట రూ.12 లక్షలు, ఆ తర్వాత రూ. 60 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆఖరికి ఫిక్సిడ్ డిపాజిట్ లో ఉన్న రూ. 22 లక్షల రూపాయలను డబ్బును.., ఎఫ్డీలు రద్దు చేసుకుని సైబర్ మోసగాళ్లకు సమర్పించుకున్నాడు.

అయితే, నాలుగు రోజుల నుంచి ముభావంగా ఉన్న రైల్వే ఉద్యోగి మహ్మమద్ వలీని సహచరులు ఏమైందని ప్రశ్నించగా, జరిగిన విషయం అంతా చెప్పారు. స్నేహితుల సూచన మేరకు బాధితుడు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆరా తీస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబర్లలో ఒకటి జమ్మూ కశ్మీర్ నుంచి, మరొకటి కోల్‌కతా నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు రైల్వే ఉద్యోగి మహమ్మద్ వలి పోలీసులను ఆశ్రయించడం ఆలస్యం అవ్వడంతో.. 72 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గుత్తి పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం వేట మొదలుపెట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..