Students Fight: నడి రోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఎందుకో తెలుసా?
ప్రకాశంజిల్లా మార్కాపురంలోని మూడు ఇంజనీరింగ్ కాలేజిలకు చెందిన విద్యార్దులు ఒకరినొకరు చితకబాదుకున్నారు. మార్కాపురం మండలం దరిముడుగు సమీపంలో ఉన్న ఇందిర కాలేజి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది..
చిన్న మాట.. ఓ చిన్నమాట.. మూడు ఇంజనీరింగ్ కాలేజి విద్యార్దుల మధ్య చిచ్చుపెట్టింది. ఓ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్దులు, మరో రెండు ఇంజనీరింగ్ కాలేజికి చెందిన జూనియర్లను అవమానించారట. అంతే అంతా కలిసి కలబడిపోయారు. ఒకరినొకరు దుమ్ముదుమ్ముగా కొట్టుకున్నారు. ఒకే పట్టణంలోని మూడు ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతున్న విద్యార్దులు నడిరోడ్డుపై ఘర్షణకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు కాలేజి యాజమాన్యాలు రంగంలోకి దిగి విద్యార్దులకు సర్దిచెప్పాల్సి వచ్చింది. అసలు విషయం చిన్నదే అయినా వీరిలో కొంతమంది విద్యార్దులు మద్యం సేవించి ఉండటం వల్లే ఇంత పెద్ద రచ్చకు దారి తీసిందని భావిస్తున్నారు.
ప్రకాశంజిల్లా మార్కాపురంలోని మూడు ఇంజనీరింగ్ కాలేజిలకు చెందిన విద్యార్దులు ఒకరినొకరు చితకబాదుకున్నారు. మార్కాపురం మండలం దరిముడుగు సమీపంలో ఉన్న ఇందిర కాలేజి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు కాలేజీల ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. మా కాలేజీ జూనియర్ విద్యార్థులను ఇన్సల్ట్ చేశారంటూ ఏ వన్, జార్జి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కలిసి ఇందిరా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను అడగడానికి వచ్చారు. మా కాలేజికి వచ్చి మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ ఇందిరా కాలేజి విద్యార్ధులు రెచ్చిపోయారు. ఏ వన్, జార్జి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ఇందిరా కాలేజీ విద్యార్థులు చితకబాదారు.
దీంతో కాలేజిలో ఉన్న మిగిలిన విద్యార్దులు పరుగులు పెట్టారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్ధంకాక చాలా మంది విద్యార్దులు భయంతో కాలేజిలోపలికి దౌడు తీశారు. ఇందిరా ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మూడు కాలేజీల విద్యార్థులను సర్ది చెప్పే ప్రయత్నం చేసినా మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు వినిపించుకోలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటికే తుక్కు తుక్కుగా కొట్టుకున్న విద్యార్దులు పోలీసులు వచ్చే సమయానికి అంతా పారిపోయారు. విద్యార్ధుల మధ్య గొడవకు దారి తీసిన కారణాలను విచారించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఘటన మార్కాపురం పట్టణంలో సంచలనం కలిగించింది. ఈ గొడవల్లో తమ పిల్లలు ఏమైనా ఉన్నారా అంటూ విద్యార్దుల తల్లిదండ్రులు వాకబు చేస్తున్నారు.
ఘర్షణ పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు