Sangam Dairy: సంగం డెయిరీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తూ ఇచ్చిన జీవోను కొట్టేసింది. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరని.. డైరెక్టర్స్ తమ విధులు నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. అయితే సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ సర్కార్ ఇటీవల జారీ చేసిన జీవో 19కి వ్యతిరేకంగా డెయిరీ డైరెక్టర్లు పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలుపగా, తాత్కాలికంగా ఈ జీవో ఇచ్చామని, సంగం డెయిరీ రోజు వారీ విధులు నిర్వహించేందుకు మాత్రమే అధికారులను ఏర్పాటు చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
అలాగే సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణపై స్టే ఇవ్వాలని ధూళిపాళ్ల న్యాయవాదులు కోరారు. ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు సీఐడీ అధికారులు వెల్లడించారు. కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టునే విచారణ చేయమని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ సమాచారాన్ని.. ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 17కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: