Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

దంపతులిద్దరూ ఓ ప్రాంతం నుంచి మరో చోటకు బైక్‌ పై వెళ్తున్నారు. వారి బైక్ కు ఉన్న హ్యాండిల్‌కు ఓ బ్యాగ్ ను తగిలించారు. అయితే కొద్ది దూరం వెళ్ళాక ఆ బైక్ కనిపించలేదు. అయ్యో.! అని కంగారుపడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే

AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా
Representative Image
Follow us
Fairoz Baig

| Edited By: Ravi Kiran

Updated on: Mar 14, 2025 | 7:36 PM

సాయత్రం ఏడున్నర గంటల ప్రాంతం. వీధులన్నీ రద్దీగా ఉన్నాయి. దంపతులిద్దరూ బైక్‌పై వెళుతున్నారు. ఆ హడావుడిలో బైక్‌కు తగిలించిన ఓ బ్యాగ్‌ జారి కిందపడిపోయింది. బ్యాగు జారిపడిపోయిన విషయాన్ని ఆ సమయంలో దంపతులు గమనించలేదు. కొద్దిదూరం వెళ్లిన తరువాత చూసుకుంటే బ్యాగు కనిపించలేదు. దంపతుల గుండెలు గుభేలుమన్నాయి. ఎందుకంటే బ్యాగులో 3.5 లక్షల నగలు, నగదు ఉన్నాయి. దీంతో లబోదిబోమంటూ ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు.

రోడ్డుపై రూపాయి పడిపోతేనే తిరిగి దొరకడం కష్టం. అలాంటిది మూడున్నర లక్షలు ఉన్న బ్యాగు తిరిగి లభిస్తుందా..! ఇది సాధ్యమయ్యేనా.. అయితే మార్కాపురం పోలీసులు దీన్ని సాధ్యం చేసి చూపించారు. రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ ద్వారా బ్యాగు ఎక్కడ పడిపోయింది. ఎవరు తీసుకెళ్ళారో కనిపెట్టి మరీ బ్యాగును రికవరీ చేసి శభాష్‌ అనిపించుకున్నారు. బాధితుల మన్ననలను అందుకున్నారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో నగదు, బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు 24 గంటల వ్యవధిలోని సొత్తును రికవరీ చేసి అందించారు. దోర్నాల మండలం వెన్నా కాశిరెడ్డి, ధనలక్ష్మి దంపతులు వ్యక్తిగత పనులపై మార్కాపురం వచ్చి తిరిగి సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో బైక్‌పై స్వగ్రామం వెళ్తుండగా వారి వద్ద ఉన్న బ్యాగు తూర్పు వీధి సమీపంలో కింద పడిపోయింది. బ్యాగు పడిపోయిన విషయాన్ని గమనించకుండా బైక్‌పై కాశిరెడ్డి దంపతులు కొద్దిదూరం వెళ్ళారు. ఆ తర్వాత చూసుకుంటే బ్యాగు కనిపించలేదు. బ్యాగులో 2 లక్షల విలువైన బంగారు నగలు, 1.50 లక్షల నగదు ఉన్నాయి. నగలు, నగదు ఉన్న బ్యాగు బైక్‌పై నుంచి జారి పడిపోవడంతో ఏం చేయాలో అర్ధంకాని దంపతులు వెంటనే మార్కాపురం పోలీసులను ఆశ్రయించారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రోడ్డుపై పరిశీలించారు. అదే సమయంలో ఓ మహిళ రోడ్డుపై పడిపోయిన బ్యాగును తీసుకెళ్లిందని గుర్తించారు. సీసీ కెమెరాలో ఉన్న దృశ్యాల ద్వారా ఆ మహిళను గుర్తించి ఆమె నుంచి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో ఉన్న మూడున్నర లక్షల విలువైన నగలు, నగదును కాశిరెడ్డి దంపతులకు అప్పగించారు. 24 గంటల వ్యవధిలో తమ బంగారు ఆభరణాలు, నగదును గుర్తించి తిరిగి అప్పగించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.