Janasena: జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు? ఉత్కంఠ రేపుతున్న అంశాలు ఇవే..
జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ సభలో పవన్ కళ్యాణ్ రెండు గంటల పాటు ప్రసంగించనున్నారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కీలక సందేశం ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వంపై, భవిష్యత్ కార్యాచరణపై వివరణ ఇవ్వడంతో పాటు, పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ప్రకటన చేయవచ్చు. ఈ సభ 'విజయకేతనం' అనే నినాదంతో చిత్రాడలో నిర్వహించబడుతుంది.

వెన్నుచూపకుండా ప్రజాక్షేత్రంలో కలబడతాం…! కెరటంలా నిలబడతాం…! అప్పుడే ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటామని చెప్పిన జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… అన్నట్లుగానే సక్సెస్ రీసౌండ్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసేలా ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. పుష్కర కాలాన్ని పురస్కరించుకుని… చిత్రాడ వేదికపై మోత మోగించేందుకు సిద్ధమయ్యారు. జనసేన ది రైజ్ అండ్ రూల్… కళ్లకు కట్టేలా అంతకుమించి ఏర్పాట్లు చేశారు. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు…? సభ పేరే జయకేతనం అని పెట్టిన ఆయన… ఇటు పార్టీ కార్యకర్తలకు అటు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు…? ఆవిర్భావ దినోత్సవం రోజు ఏమైనా అదిరిపోయే న్యూస్ చెప్పబోతున్నారా…? ఇప్పుడివే క్వొశ్చన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి.
ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిండు మనసుతో థాంక్యూ చెప్పుకుందాం అనే నినాదంతో జరుగుతున్న ఈ సభలో పవన్ దాదాపు రెండు గంటలపాటు ప్రసంగించే అవకాశముంది. ముఖ్యంగా పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడ్డవాళ్లను గుర్తించాలని భావిస్తున్న పవన్ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. భవిష్యత్ కార్యాచరణతో పాటు కూటమి ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు పవన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే 12ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల కోసం కూడా పవన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు పార్టీ శ్రేణులు. మొత్తంగా పవన్ ఏం మాట్లాడతారని రాష్ట్ర మొత్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.