
కనిగిరి పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఈ రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సమాజానికి ఎంతోకొంత మేలు చేయాలని భావించేవారిలో ఒకరు. పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఆయన తనకు తెలిసిన బేల్దారి పనికి పదును పెట్టారు. రోడ్లపై ఏ చిన్న గుంత కనిపించినా అక్కడికి చేరుకుని మరమ్మత్తులు చేపడుతున్నారు. తనకు వచ్చే పెన్షన్ డబ్బుల్లో నెలకు 4 వేల రూపాయల వరకు రోడ్ల మరమ్మత్తులకు కేటాయిస్తున్నారు. రహదారిపై గుంత కనిపిస్తే చాలు వెంటనే సిమెంటు, ఇసుక, కంకర తీసుకెళ్లి గుంతను పూడ్చేయడమే పనిగా పెట్టుకున్నారు. 68 ఏళ్ల వయసులో తన సొంత నిధులను వెచ్చించి పదిమందికి ఉపయోగపడే విధంగా చేస్తున్న ఈ పెద్దాయన ఊరికి ఉపకారిగా మారారు… గత రెండేళ్లు రికార్డు స్థాయిలో 600కు పైగా గుంతలు పూడ్చి గ్రామస్థులతో భేష్ అనిపించుకుంటున్నారు… రోడ్డుపై గుంతల్లో పడి వాహనదారులు ప్రాణాలపైకి తెచ్చుకోవడం చూసిన ఆయన ఎవరో వస్తారు, ఏదో చేస్తారని కాకుండా తన వంతు సాయంగా ఈ గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని గత రెండేళ్లుగా దిగ్విజయంగా చేసుకుంటూ పోతున్నారు. తనకు బేల్దారి పని తెలుసు కాబట్టి తనకు తోచిన విధంగా సమాజానికి మేలు చేయాలన్న రహదారులపై గుంతలను పూడుస్తున్నానని, తనకు ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నానని రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిచ్చారెడ్డి చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.