రిటైర్డ్ పీపుల్ ప్యారడైజ్.. వైజాగ్‌లో రియలెస్టేట్ పడకేసిందా? వేల కోట్ల టర్నోవర్ ఉండే వ్యాపారం అమ్మకాలు లేక వెలవెలబోయిందా? బిల్డర్లంతా ఆందోళనలో ఉన్నారా? విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామన్న కొత్త ప్రభుత్వంపైనే వారు కోటి ఆశలు పెట్టుకున్నారా? సిటీ ఆఫ్ డెస్టినీ కాస్త పిటీ ఆఫ్ డెస్టినీగా మారిందా? అసలు విశాఖలో ఏం జరుగుతున్నది?
ఆంధ్రప్రదేశ్‌లోని అతి ముఖ్య నగరాల్లో విశాఖ సిటీ మొదటిది. సుమారు 25 లక్షల జనాభా ఈ సిటీలో నివసిస్తున్నది. ఇక ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఎక్కువే. భౌగోళిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నగరానికి విశేష ప్రాధాన్యముంది. బీచ్ సిటీ కావటం, చుట్టూరా పచ్చగా పరుచుకున్న ఈస్ట్రన్ ఘాట్స్‌కి బంగాళాఖాతానికి మధ్యలో ఉంటుంది విశాఖ సిటీ. ఎటు చూసినా గ్రీనరీతో ఇట్టే ఆకట్టుకుంటుంది. చాలా మంది తమ విశ్రాంత జీవితాన్ని ఈ నగరంలోనే గడపాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే దీన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుచుకుంటారు. ఎక్కడెక్కడి జనం నగరానికి వచ్చి స్థిర నివాసాలు ఏర్పర్చుకుంటుంటారు. మరి ఇలాంటి మోస్ట్ హ్యాపెనింగ్ సిటీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు ప్లాట్స్, ఆరు అపార్ట్‌మెంట్స్‌లాగా దూసుకుపోతుందా? అంటే సమాధానం లేదనే చెప్పాలి.
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ రియల్ ఎస్టేట్ రంగం భారీ కుదుపులకు గురైంది. గత వైసీపీ పాలనలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వైజాగ్‌ను పేర్కొనటంతో ఇక్కడి రియల్ రంగం ఒక్కసారిగా ఊపందుకుంది. చకచకా అపార్ట్‌మెంట్లు నిర్మాణమయ్యాయి. సుమారు 20 వేల ఫ్లాట్లు ఆక్యుపై చేసుకోవటానికి రెడీగా ఉండగా.. మరో 20 వేల ఫ్లాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అధికారం మారింది. దీంతో మూడు రాజధానుల కాన్సెప్ట్ మరుగున పడిపోయింది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. కొత్త ప్రభుత్వం వైపు ఇప్పుడు వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
విశాఖ అందాల నగరమే గాక.. ఎన్నో కంపెనీలకు ఆలవాలమైనది కూడా. సీ పోర్ట్‌తో పాటు గంగవరం పోర్ట్ కూడా కొత్తగా ఏర్పాటైంది. వీటి వల్ల అనేక అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతుల కేంద్ర కార్యాలయాలన్నీ విశాఖకు తరలివచ్చాయి. వీటికి అదనంగా ఎప్పటి నుంచో ఉన్న స్టీల్ ప్లాంట్, బీహెచ్‌ఈఎల్ లాంటి ప్రభుత్వ రంగ భారీ సంస్థలు, మరెన్నో వాణిజ్య, వ్యాపార ఆటో మొబైల్ రంగాలకు విశాఖ పేరెన్నికగన్నది. తూర్పు నావికా దళానికి విశాఖనే హెడ్ క్వార్టర్స్ వల్ల నగరంలో హడావిడి కాస్త అధికంగానే ఉంటుంది. దీనికి తోడు బీచ్ అందాలు, ఎత్తైన కొండల రమణీయత చూడటానికి వచ్చే టూరిస్టులతో నగరం ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఇక ఎత్తైన విశాఖ కొండలపై ఐటి హిల్స్ పేరుతో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయటానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో నగరానికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు దక్కింది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. దేశంలో మెట్రో సిటీస్ తర్వాత వేగంగా విస్తరిస్తున్న, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖది తొమ్మిదో స్థానం. ప్రశాంతమైన వాతావరణం కూడా విశాఖకు కలిసొచ్చే అంశం. నట్టనడి వేసవిలో కూడా విశాఖలో సాయంత్రాలు చల్లగా ఉంటాయి. అందువల్లే ఇక్కడ నివసించటానికి జనం బాగా ఇష్టపడతారు. ఫలితంగా నగరంలో నిర్మాణ రంగం ఎదగటానికి ఎక్కువ స్కోప్ దొరికింది. 2004లో కేవలం వంద కోట్ల రూపాయల టర్నోవర్ ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు వంద రెట్లు పెరిగి వెయ్యి కోట్ల వ్యాపారంగా ఎదిగింది.
దీంతో విశాఖ నగర శివారు ప్రాంతాలైన ఎండాడ, మధురవాడ, సాగర్‌నగర్, పరవాడ, అచ్యుతాపురం, పెందుర్తి, అనకాపల్లి వరకు అభివృద్ధి చెందుతోంది. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో విశాఖకు శ్రీకాకుళంకు మధ్యలో విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఊపందుకోవటం శుభ పరిణామం. శ్రీకాకుళంలో మూలపాడు పోర్టు ఏర్పాటు నేపథ్యంలో మార్గాన్ని వేగంగా డెవలప్ చేస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తానని ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. విశాఖ రాజధాని నగరమైతే భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మరెన్నో కార్పొరేట్ ఆఫీసులు వస్తాయని, ఐదంకెల జీతాలందుకునే ఉద్యోగుల సంఖ్య వేలల్లో ఉంటుందని బిల్డర్లు భావించారు. అందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నగర శివార్లలో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి పూనుకున్నారు.
అయితే న్యాయ స్థానాల జోక్యం, వివిధ కారణాల వల్ల తమ పదవీ కాలం పూర్తయ్యేలోపు జగన్ ప్రభుత్వం విశాఖను రాజధానిగా మార్చలేకపోయింది. ఒక్క రుషికొండ నిర్మాణాలు తప్ప విశాఖలో పెద్దగా చెప్పుకోతగిన అభివృద్ధి జరగలేదన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2024లో విశాఖ ప్రజలు అనూహ్య తీర్పునిచ్చారు. ఇప్పుడు అధికారం మారింది. ఐటీ మంత్రిగా లోకేశ్ వచ్చారు. ఆయన భరోసాతో విశాఖ రియలెస్టేట్ రంగానికి కొత్త ఊపిరి వచ్చినట్టయ్యింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి పునర్జీవం పోస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం విశాఖని ఆర్థిక రాజధానిగా తయారు చేస్తామని హామీ ఇచ్చింది. ఐటీని అభివృద్ధి చేయడంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించింది. దీంతో భవన నిర్మాణ రంగం మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఈ క్రమంలోనే బిల్డర్లు ప్రభుత్వం నుంచి మరింత సహకారం కోరుతున్నారు.
కొత్త ప్రభుత్వంపై విశాఖ నగరం కోటి ఆశలు పెట్టుకుంది. ఐటీ పెట్టుబడులను వేగవంతం చేయాలని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరగా పూర్తి చేయాలని, నగరంలో రద్దీగా ఉండే జంక్షన్‌లలో ఫ్లయ్ ఓవర్లు, స్టీల్ ప్లాంట్ నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైలును ప్రారంభించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో నిర్మాణ కార్యకలాపాలు పెంచటానికి కొత్త విధానాలను రూపొందిస్తారని బిల్డర్లు ఎదురు చూస్తున్నారు. అనుమతులు ఇతర అవసరాలకు సింగిల్ విండో విధానం పెట్టాలని, రాయితీలు ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు. గత ఐదేళ్లలో కోవిడ్ మహమ్మారి వల్ల కొంత, రాజకీయ కారణాల వల్ల మరికొంత నష్టపోయి కష్టాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ప్రభుత్వం ఆక్సిజన్ అందించాలని, మళ్లీ కోలుకుని ఆరోగ్యంగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు కల్పించాలని రియల్టర్లు కోరుకుంటున్నట్టే.. తమ నగరాన్ని వాల్డ్ క్లాస్ సిటీగా మార్చాలని నగర వాసులు కోరుతున్నారు.
ఇది చదవండి: సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..