రామచంద్రపురంలో సంచలనం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
హనీ, హనీ అంటూ ముద్దుగా పిలుస్తూ అనురాగాలు పంచాడు.. చివరికి అనురాగానికే హాని చేసాడు. తనకున్న ఆర్ధిక ఇబ్బందులు అతడిని ఇంతటి క్రైమ్ చేసే విధంగా దిగజార్చాయి. నమ్మిన వాడే చిన్నారి ఊపిరిని తీసేసిన హృదయ విధారకరమైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగింది..

రామచంద్రపురం పట్టణంలో చోటుచేసుకున్న చిన్నారి సిర్రా రంజిత హత్య కేసు వెనుక ఉన్న భయానక నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం పోలీసులు ఈ కేసును చేధించారు. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన సిర్రా సునీత స్థానిక ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె భర్త సిర్రా రాజు ముంబయిలో మెరైన్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె నవోదయ స్కూల్‌లో 9వ తరగతి చదువుతుండగా, చిన్న కుమార్తె సిర్రా రంజిత (హనీ) రామచంద్రపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది.
అంబికపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన పెయ్యల శ్రీనివాస్ ఈ కుటుంబానికి సన్నిహితుడు. ఇంటి ఎలక్ట్రికల్ పనులు చేస్తూ నమ్మకం పొందిన అతను.. సునీతను అక్క, రాజును బావ అని పిలిచేవాడు. హనీని మేనకోడలు అంటూ ముద్దుగా మెలిగేవాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు, బ్యాంకు ఈఎమ్‌ఐలు, చెల్లెలి పెళ్లి భారం పెయ్యల శ్రీనివాస్‌ను నేర మార్గం వైపు నడిపించాయి. ఈ నెల 3న సునీత విధులకు వెళ్లి ఇంట్లో హనీ ఒక్కతే ఉన్న సమయంలో శ్రీనివాస్ దొంగతనానికి ఆ ఇంటికి వెళ్లాడు. తలుపు గడి తీసి లోపలికి వెళ్లిన అతన్ని చూసిన బాలిక హనీ ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడిగింది.ఫ్యాన్ రిపేర్ చేయడానికి వచ్చాను అని సమాధానమిచ్చాడు. కానీ బాలిక తల్లికి ఫోన్ చేయడానికి ప్రయత్నించడంతో, నిజం బయటపడిపోతుందనే భయంతో నిందితుడు రంజితను ఊపిరాడకుండా కర్కశంగా గొంతు నులిమి హత్య చేశాడు. హత్యను దాచిపెట్టేందుకు నిందితుడు బాలిక మెడకు చున్నీ కట్టి ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా మలిచాడు. ఆపై స్కూల్ వద్దకు వెళ్లి సీసీ పుటేజ్ సేకరించి, వాట్సాప్‌లో సందేశం పెట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ అదే సందేశం పోలీసుల దృష్టిని అతనిపైకి మళ్లించింది.
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు కేసు దర్యాప్తు చేపట్టాయి. టెక్నికల్, సైంటిఫిక్ ఆధారాల ద్వారా పెయ్యల శ్రీనివాసే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుచేయగా రిమాండ్ విధించారు. వారం రోజుల్లోనే పోలీసులు ఈ కేసును చేధించి చాకచక్యాన్ని చాటుకున్నారు. “మా కూతురిని ఇంత దారుణంగా చంపిన వాడిని జైలులో పెట్టి పోషిస్తారా?” అంటూ తల్లిదండ్రులు సునీత, రాజులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలంటే నిందితుడిపై ఎన్‌కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
