Heavy Rains in Andhra Pradesh: ఈ వర్షాకాలంలో జోరు వానలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినా.. మళ్లీ జోరందుకుంటున్నాయి. రుతుపవనాల కదలికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. వచ్చే 14 రోజులు రాష్ట్రంలో మరింత విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కాగా, శుక్రవారం ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఈనెల 10న కోస్తా తీరంలో గంటకు 40 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునన్నారు. మరోవైపు, వాతావరణ హెచ్చరికలతో తీర ప్రాంత అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుస్తుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరిస్తున్నారు.