ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు.. అక్కడే తేల్చుకుంటాననడం వెనుక వ్యూహం ఏంటి..?

| Edited By: Srikar T

Jun 14, 2024 | 8:59 AM

విజయనగరం జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజుపై ఈ నెల 3న అర్హత వేటు వేశారు మండల చైర్మన్ మోషన్ రాజు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మండలి ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇందుకూరి రఘురాజు శాసనమండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రఘురాజు పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పనిచేశారు. అయితే ఈ క్రమంలోనే ఎస్ కోట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కడుబండి శ్రీనివాసరావుతో రఘురాజుకు విభేదాలు మొదలయ్యాయి.

ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు.. అక్కడే తేల్చుకుంటాననడం వెనుక వ్యూహం ఏంటి..?
Mlc Raghu Raju
Follow us on

విజయనగరం జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజుపై ఈ నెల 3న అర్హత వేటు వేశారు మండల చైర్మన్ మోషన్ రాజు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మండలి ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇందుకూరి రఘురాజు శాసనమండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రఘురాజు పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా పనిచేశారు. అయితే ఈ క్రమంలోనే ఎస్ కోట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కడుబండి శ్రీనివాసరావుతో రఘురాజుకు విభేదాలు మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడుబండి అభ్యర్థిత్వాన్ని మార్చాలని పట్టుబట్టారు రఘురాజు. దీంతో ఎస్ కోటలో ఎమ్మెల్యే కడుబండి వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజుగా రాజకీయాలు మారాయి. ఈ వ్యవహారం వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ వద్దకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రఘురాజు ఒకింత మనస్తాపానికి గురయ్యారు. ఇది ఇలా జరుగుతుండగానే ఎస్ కోట వైస్ ఎంపిపి, రఘురాజు సతీమణి అయిన ఇందుకూరి సుధారాణి తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి వైసిపిని వీడి లోకేష్ సమక్షంలో టిడిపిలో జాయిన్ అయ్యారు. అంతేకాకుండా టిడిపిలో యాక్టివ్‎గా పనిచేశారు. అలా రఘురాజుకు పార్టీకి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. దీంతో రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ శాసనమండలి ఛైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు.

మండలి చైర్మన్ ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 27న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న తమపై ఎందుకు అనర్హత వేటువేయకూడదో సంజాయిషీ ఇవ్వాలని రఘురాజుకు నోటీస్ పంపించారు మండలి చైర్మన్. ఆ నోటీస్‎లో రఘురాజు భార్య సుధారాణి పార్టీ మారారని, టిడిపి ఇన్చార్జిగా ఉన్న కోళ్ల లలితకుమారితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారని, అంతేకాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాటికి సంజాయిషీ మే 4 వ తేదీకి సమాధానం ఇవ్వాలని నోటీస్‎లో పేర్కొన్నారు. అయితే అనివార్య కారణాలతో పాటు అనారోగ్య సమస్యల వల్ల తనకి కొంత సమయం కావాలని కోరారు రఘురాజు. రఘురాజు విన్నపం మేరకు కొంత సమయం ఇచ్చిన మండలి ఛైర్మన్ ఆ తరువాత చివరిగా మే 31న హాజరై వివరణ ఇవ్వాలని కోరారు. అయితే అప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయిన రఘురాజు మే 31 న కూడా తాను హాజరుకాలేనని, తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు రఘురాజు. అందుకు నిరాకరించిన మండలి చైర్మన్ రఘురాజు వైసిపి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడట్టు నిర్ధారించుకొని జూన్ 3న అనర్హత వేటు వేశారు. అయితే మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయంపై రఘురాజు ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారో అని సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే రఘురాజు మాత్రం తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తనపై కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తనపై అనర్హత వేటు వేయడానికి నిబంధనలు వర్తించవని, తనకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని అంటున్నారు. అసలు తన వాదన వినకుండా తనపై వేటు ఎలా వేస్తారని అంటున్నారు. ఈ అంశంపై రఘురాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టులో ఎలాంటి తీర్పు వెలువడుతుందో అని సర్వత్రా ఉత్కంఠగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..