Daggubati Purandeswari On Alliance: చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని.. కలిసే ఎన్నికలకు వెళ్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే, బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆరోజున తెలిపారు. అయితే, పవన్ కల్యాణ్ వ్యాఖ్యల అనంతరం మిత్ర పక్షమైన బీజేపీ పార్టీ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.. పవన్ కల్యాణ్ సూచనతో మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా..? లేక బీజేపీ వేరేగా పోటీ చేస్తుందా..? అనే విషయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు మాత్రమే పొత్తులపై పార్టీలో చర్చ జరుగుతుందన్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. టీడీపీతో పొత్తుపై జాతీయ నాయకత్వంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చర్చించిన తర్వాత బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పురంధేశ్వరి స్పష్టంచేశారు. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తు ఉందని.. ఎన్నికల సమయంలోనే పొత్తులపై తుది నిర్ణయం వస్తుందని తెలిపారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న విషయంపై పురంధేశ్వరి మరోసారి క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి, కేంద్రానికి సంబంధం లేదన్నారు పురంధేశ్వరి. ఆయన్ను అరెస్టు చేసిన విధానం సరిగా లేదని మొట్టమొదటిసారిగా ఖండించిన పార్టీ బీజేపీయే అన్నారు. విచారణ సంస్థ రాష్ట్ర పరిధిలో ఉందని.. కోర్టు పరిధిలో ఉండగా ఈకేసుపై మాట్లాడటం సరికాదాన్నరు. చంద్రబాబు అరెస్టుకు కేంద్రానికి సంబంధం లేదు.. CID రాష్ట్ర పరిధిలో ఉంటుందని, కోర్టు పరిధిలో అంశాలపై చర్చించడం సరికాదంటూ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.
ఏపీలో అమలు అవుతున్న మద్యం విధానంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ పురంధేశ్వరి ఆరోపించారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ వందల కోట్లు కొల్లగొడుతున్నారని.. దీనిపై విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాస్తామని పురంధేశ్వరి పేర్కొన్నారు. మద్యం విధానంలో భారీగా అవినీతి చోటుచేసుకుంటోంది.. ఏపీలో మద్యం అక్రమాలపై విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..