Andhra: కర్నూలులో పూర్తిగా దగ్దమైన ప్రైవేట్ బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా

కర్నూలు జిల్లాలో ప్రైవేట్‌ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పలువురు ప్రయాణికులు మృతిచెందినట్టు సమాచారం. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..

Andhra: కర్నూలులో పూర్తిగా దగ్దమైన ప్రైవేట్ బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా
Representative Image

Updated on: Oct 24, 2025 | 6:50 AM

కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర V కావేరీ ట్రావెల్స్‌ బస్సు మంటల్లో కాలిబూడిదైంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో.. ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బైకు బస్సుకిందకు వెళ్లి పేలిపోవడంతో.. మంటలు అంటుకున్నాయి.

ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ద్వారా బయటపడ్డారు. పలువురు ప్రయాణీకులు సజీవదహనం అయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.

ఇదిలా ఉండగా.. బెంగళూరు వెళ్తున్న బస్సు టూవీలర్‌ను ఢీకొట్టిడంతో ఈ ప్రమాదం జరిగిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పొగను గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారు. కొంత మంది బయటపడ్డా, మరికొంత మంది రాలేకపోయారు. మంటలతో లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు ఎస్పీ. ఈ ఘటన గురించి తెలియగానే FSL టీమ్‌ స్పాట్‌కు చేరింది. బస్సు ఎక్స్‌‌ట్రా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం. డ్రైవర్‌ను కూడా పంపించాలని ట్రావెల్స్ యాజమాన్యానికి చెప్పామన్నారు ఎస్పీ. ప్రమాద తీవ్రత ఈస్థాయిలో ఉంటుందని డ్రైవర్లు అంచనా వేయలేకపోయారని పేర్కొన్నారు.

అటు ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సీఎస్‌, అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలన్నారు.

వీడియో: