
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి హోంమంత్రి అనితతో పాటు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నేరుగా తిరుచానూరుకు చేరుకున్న ముర్ము, శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆమెతో పాటు ఆమె కూతురు ఇతిశ్రీ ముర్ము, అల్లుడు, మనవళ్లు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణం చేసి నమస్కరించారు. అనంతరం వేద పండితులు రాష్ట్రపతికి ఆశీర్వచనం చేయగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిలు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ముర్ము తిరుమల చేరుకున్నారు. శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఇతర అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి ఈ రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు.
రాష్ట్రపతి శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ముందుగా వరాహస్వామిని దర్శించుకోనున్న రాష్ట్రపతి, అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. శ్రీవారి దర్శనం పూర్తయ్యాక రాష్ట్రపతి తిరుగు ప్రయాణమై తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.