
ప్రకాశం జిల్లా పొదిలి ఎస్‌ఐ వేమన వ్యవహారశైలిపై జనం తిరగబడ్డారు. ఓ వ్యాపారస్థుడ్ని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బూతులు తిట్టారంటూ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. ఓ షాపు ముందు లారీ ఆగినందుకు రోడ్డుకు అడ్డంగా ఉందంటూ తొలుత లారీ డ్రైవర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా షాపు యజమానులైన తండ్రీ కొడుకులను చితకబాది తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించారు. గతంలో కూడా ఎస్‌ఐ వేమన సివిల్ తగాదాల్లో తలదూర్చి బాధితులను విచక్షణా రహితంగా కొట్టారంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా పొదిలిలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులతో కలిసి ఆర్యవైశ్య సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం పోలీసుశాఖకు తలవంపులు తెచ్చిపెట్టింది.
మూడు రోజుల క్రితం లారీ అన్లోడింగ్ విషయంలో అన్యాయంగా పరిధి దాటి ఎరువుల షాపు వ్యాపారి యదాల కోటేశ్వరరావు, ఆయన కుమారుడు అవినాష్ ను పొదిలి ఎస్‌ఐ వేమన విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపర్చారని బాధితులు తెలిపారు. ఎస్‌ఐ కొట్టిన దెబ్బలకు ట్రీట్‌మెంట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటే మెడికో లీగల్ కేసు ఎస్‌ఐపై పెట్టాల్సి వస్తుందన్న కారణంగా బలవంతంగా బాధితుడు అవినాష్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి అర్ధరాత్రి వరకు నిర్భంధించి భయభ్రాంతులకు గురిచేశారని చెబుతున్నారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. గతంలో ఏనాడు జరగని విధంగా ఎస్‌ఐ వేమన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఎస్‌ఐ వేమనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల అరాచకాలు రోజు రోజుకి మితిమీరి పోతున్నాయన్న ఆరోపణలు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది పోలీసులు సివిల్ మ్యాటర్ లో సైతం తలదూర్చుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. పొదిలి ఎస్‌ఐ వేమన గతంలోనూ కోర్టు పరిదిలో ఉన్న వివాదస్పద స్థల విషయంలో స్థల యజమాని భవనం శ్రీనివాస్ రెడ్దిని స్టేషన్ కి పిలిపించి చితకబాదాడన్న ఆరోపణలు ఉన్నాయి. భవనం శ్రీనివాస్ రెడ్ది కి చెందిన స్థలం పదేళ్ల నుండి కోర్టు పరిధిలో ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు ఆ స్థలంలో జేసిబి సహాయంతో చెట్లు తొలగిస్తుండటంతో శ్రీనివాస్ రెడ్ది అభ్యంతరం తెలిపాడు. రాజకీయ నాయకులు ఎస్‌ఐ వేమన కి ఫిర్యాదు చెయ్యడం తో శ్రీనివాస్ రెడ్దిని పోలీస్ స్టేషన్ కు పిలిపించిన ఎస్‌ఐ వేమన అతడ్ని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా బూట్ కాలితో తన్నాడని బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఈ విషయం బయటకు చెపితే ఏన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాడని శ్రీనివాస్ రెడ్ది, అతని తల్లి లక్ష్మమ్మ కన్నీటి పర్యంతం అయ్యాడు… తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ రెడ్దిని బంధువులు ఒంగోలు జిజిహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..