AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నది ఆ ఎంపీ టార్గెట్‌.. సాగరతీరంలో విజయం తనదేనంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే..

ఆ ఎంపీ ఎమ్మెల్యే అయి రాష్ట్ర మంత్రి కావాలనుకున్నారు. మంత్రి పోస్టు తర్వాత ముందైతే ఎమ్మెల్యేగా పోటీకి లైన్‌ క్లియర్‌ చేసుకున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అనుకుంటూ వెంటనే వర్క్‌ స్టార్ట్‌ చేసేశారు. కలిసొచ్చిన వినాయకచవితితో గడపగడపకీ గణపతి విగ్రహాలు చేరవేశారు. అధికారపార్టీనుంచి సిట్టింగ్‌ ఎంపీ సైఅంటుంటే.. మూడుసార్లు గెలిచిన విపక్షపార్టీ ఎమ్మెల్యే ఎవరొచ్చినా మళ్లీ గెలుపు నాదేనంటున్నారు. ఆ నియోజకవర్గం ఏంటో.. ఆ ఉద్ధండులెవరో చూసేద్దామా?

AP Politics: అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నది ఆ ఎంపీ టార్గెట్‌.. సాగరతీరంలో విజయం తనదేనంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే..
Visakha Political Equations
Sanjay Kasula
|

Updated on: Sep 20, 2023 | 9:53 PM

Share

వైజాగ్‌ రాజకీయమంటేనే సమ్‌థింగ్‌ స్పెషల్‌. పైగా రాష్ట్ర పాలనారాజధానిగా సాగరనగరికి ఈసారి మరింత ప్రాధాన్యం పెరిగింది. స్టేటంతా గిర్రున తిరిగిన ఫ్యాన్‌ వైజాగ్‌లో ఆగిపోవటంతో అధికారపార్టీ కూడా ఈసారి సవాలుగా తీసుకుంది. 2019లో రాష్ట్రమంతా వైసీపీ గాలివీచినా విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ సీట్లూ టీడీపీకే దక్కాయి. దీంతో 2024లో విశాఖ రాజకీయం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీకి దిగుతుండటంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

అసెంబ్లీకి పోటీకి ఎంవీవీ ఆసక్తిచూపడం, అధికారపార్టీ కూడా విశాఖ తూర్పులో టీడీపీకి చెక్‌ పెట్టేందుకు బలమైన అభ్యర్థి వేటలో ఉండటంతో రెండూ మ్యాచ్‌ అయ్యాయి. వైజాగ్‌ ఈస్ట్‌ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న అక్కరమాని విజయనిర్మలకి భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ నాయకత్వం.. ఎంవీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించింది. అక్కరమాని ఇంకా ఎంపీకి బహిరంగంగా తన మద్దతు ప్రకటించలేదు కానీ.. ఎంవీవీ మాత్రం నియోజకవర్గంలో దిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని వర్గాలకు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.

ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న ఎంవీవీ 2019లో అనూహ్యంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి అయ్యారు. పురందేశ్వరి, జేడీ లక్ష్మీనారాయణ, గీతం భరత్‌లాంటి ప్రత్యర్థులున్న చోట ఎంవీవీని వైసీపీ పోటీకి దించింది. విపక్షపార్టీల మధ్య పొత్తులు లేక విడివిడిగా పోటీ చేయడంతో నాలుగువేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై ఎంపీగా గెలిచారు ఎంవీవీ. ఎంపీగా మళ్లీ పోటీకి ఆసక్తిగా లేని ఎంవీవీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలన్న టార్గెట్‌ పెట్టుకున్నారు. అయితే వైసీపీ ఎంపీ ఎన్నుకున్న తూర్పు నియోజకవర్గంలో ఆయనకు మొదటి ఛాలెంజ్ టీడీపీ ఎమ్మెల్యే రూపంలోనే ఎదురవుతోంది. 2009నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ కొట్టిన వెలగపూడి రామకృష్ణ అక్కడ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. దీంతో వెలగపూడికి ఉన్న క్రేజ్‌ని ఎదుర్కునేందుకు ముందు ప్రజలతో మమేకం కావాలన్న నిర్ణయానికొచ్చారు ఎంపీ ఎంవీవీ.

తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు తీసుకోగానే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎంవీవీ. వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆత్మీయ సమావేశాల పేరుతో క్యాంపు కార్యాలయంలో క్రియాశీలక నేతలని కలుస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో తమ సంస్థ నిర్మించిన అపార్ట్‌మెంట్ల వాసుల్ని, పరిచయస్తులని సమూహంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కులాలవారీ సమావేశాలతో వారికి అవసరమైన సహకారాన్ని అందించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు ఎంవీవీ. ఇదంతా ఒక ఎత్తయితే పార్టీ కార్పొరేటర్లని పూర్తిగా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. డిన్నర్ మీట్ ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేటర్‌కి 5 లక్షల నగదుతో పాటు బట్టలు కూడా పెట్టారట. ఇది జస్ట్‌ టోకెనేనని.. ఎమ్మెల్యేగా గెలిస్తే అందరినీ చూసుకుంటానని చెప్పారట ఎంవీవీ.

భేటీకి వస్తానన్న ఒక కార్పొరేటర్ రాకపోవడంతో ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడి మద్దతు కోరారట ఎంవీవీ. అప్పటినుంచీ నిరంతరం ఆత్మీయ సమావేశాలు, కాలనీవాసుల మీటింగులతో బిజీ అయిపోయారాయన. ప్రభుత్వంతో సంబంధం లేకుండా చిన్న చిన్న ఆర్థిక అవసరాలు ఉంటే కాలనీలకు తానే నేరుగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట ఎంవీవీ. ప్రార్థనామందిరాలకు చందాలతో పాటు, కుల సంఘాలకు అవసరమైన ఆనిధులు ఇవ్వడం లేదంటే ప్రభుత్వం నుంచి అవసరమైన పనులు చేయించే ప్రయత్నాల్లో ఉన్నారట ఎంవీవీ. ఇవన్నీ ఒక ఎత్తయితే నియోజకవర్గంలో 60 వేల హిందూ కుటుంబాలకు గణేష్ విగ్రహాలు అందించి ప్రతీచోటా తన ముద్ర ఉండేలా చూసుకున్నారట వైసీపీ ఎంపీ. గణేష్‌ ప్రతిమలతో పాటు పత్రి, పూజ సామాగ్రిని కూడా ఇంటింటికీ చేర్చారట ఎంవీవీ.

ఎంపీ స్పీడ్‌పెంచినా టీడీపీ ఎమ్మెల్యే మాత్రం నిండుకుండలా నిశ్చింతగా ఉన్నారట. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో మమేకమైన తననే ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు వెలగపూడి. ఎంపీగా గెలిచాక ఎంవీవీ ఎప్పుడూ ప్రజల్లో లేరని.. ఎన్నికలకోసం ఎన్ని ఫీట్లు చేసినా ఆయన్ని ఎవరూ నమ్మరన్న నమ్మకంతో ఉన్నారట వెలగపూడి. ఆర్థికంగా తనకంటే బలవంతుడైన ఎంవీవీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తూర్పు నియోజకవర్గ ప్రజలు తననే ఆశీర్వదిస్తారంటున్నారాయన. అవసరమైతే ఎంపీ ఓటుకి ఎంతయినా ఇస్తారని, ఆ డబ్బు తీసుకున్నా ఓటుమాత్రం టీడీపీకి వేయాలంటున్నారట ఎమ్మెల్యే. మరోవైపు కేడర్‌ని యాక్టివేట్‌ చేస్తూ నిత్యంఏదో ఒక ప్రోగ్రాంతో జనంలోనే ఉంటున్నారు వెలగపూడి కూడా. ఓవైపు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మరోవైపు ఆర్థికంగా బలంగా ఉన్న ఎంపీ మధ్య పోరాటం. పైగా ఇద్దరూ కమ్మ సామాజికవర్గ నేతలే కావటంతో.. హోరా హోరీ పోటీ జరిగే నియోజకవర్గాల్లో విశాఖ తూర్పు ఉంటుందన్న చర్చ నడుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం