తాడేపల్లి మండలం సీతానగరం అత్యంత హై సెక్యూరిటీ ఉండే ప్రాంతం. సీతా నగరం సమీపంలోనే ముఖ్యమంత్రి నివాసం ఉంటుంది. సీతానగరంలో కృష్ణా నది వెంట పుష్కరాల సమయంలో స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. కృష్ణా తీరం వెంట ఉండే ఈ ప్రాంతం గత కొంతకాలంగా అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలకు ఆధారంగా కృష్ణ నదిలో ఏడాది క్రితం గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో మందు బాబుల ఆగడాలు పెరిగిపోయాయి. ప్రకాశం బ్యారేజి పైకి వచ్చే పర్యాటకులు అప్పుడప్పుడు ఈ ఘాట్ ల వద్దకు వస్తుంటారు. దీంతో ఆకతాయిలు రెచ్చిపోతుంటారు.
మరోవైపు, కృష్ణానదిలో స్నానం చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి మునిగిపోతుంటారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి కృష్ణా నదిలో దూకుతుంటారు. మొత్తానికి ఈ ప్రాంతం ఒక డెత్ స్పాట్ లా మారింది. ఇక్కడ భద్రత కల్పించడం తాడేపల్లి పోలీసులకు సవాల్ గా మారింది. ఈ నేపధ్యంలోనే ఇక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వీధి దీపాలు పెట్టారు. తాజాగా ఘాట్ లో కూర్చోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు నదిలో లోతు ఎక్కువగా ఉందని స్నానాలకు దిగవద్దంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మొత్తానికి నేరాల నియంత్రణకు కృష్ణా తీరంలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు