AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఉలిక్కిపడ్డ గిరిజన గ్రామాలు, ఇళ్లలోకి వందలమంది పోలీసులు.. అసలేం జరిగిందంటే..?

గిరిజన గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంతా అమాయక గిరిజనులు కావడంతో ఏమి జరిగిందో?.. తనిఖీలు చేస్తున్నారో..? తెలియక స్థానికులు టెన్షన్ పడ్డారు. పోలీసుల తీరుపై గిరిజన సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక గిరిజనుల ఇళ్లలో అకస్మాత్తుగా సోదాలు చేయడం సరైన పద్ధతి కాదని అంటున్నారు.

Andhra Pradesh: ఉలిక్కిపడ్డ గిరిజన గ్రామాలు, ఇళ్లలోకి  వందలమంది పోలీసులు.. అసలేం జరిగిందంటే..?
Police Cordon Search
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Jul 31, 2025 | 9:14 PM

Share

విజయనగరం జిల్లా గిరిజన గ్రామాల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్ కోట మండలంలోని సుమారు పదహారు గిరిజన గ్రామాల్లోకి తెల్లవారుజామున భారీ ఎత్తున పోలీసులు ప్రవేశించి పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించారు. వంద మందికి పైగా పోలీసులు కార్డన్ సెర్చ్‌లో పాల్గొని గిరిజనుల ఇళ్లన్నింటిని అణువణువు తనిఖీ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా గ్రామాల్లోకి ప్రవేశించిన పోలీసులు ఒక్కో ఇంటిని పూర్తిగా గాలించారు. కార్డన్ సెర్చ్ జరుగుతుందన్న సమాచారం తెలియకపోవడంతో గిరిజన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు నిషేధిత పదార్థాలు, మావోయిస్టు సంబంధిత వస్తువులు, ఆయుధాలు వంటి అనుమానాస్పద వస్తువుల కోసం వెతికినా ఎలాంటి నిషేధిత పదార్థాలు, వస్తువులు లభించలేదు.

సుమారు ఆరు గంటల పాటు ఈ కార్డన్ సెర్చ్ సాగింది. అంతా అమాయక గిరిజనులు కావడంతో ఏమి జరిగిందో? ఎందుకు తమ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారో..? తెలియక అయోమయ పరిస్థితి ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక గిరిజనుల ఇళ్లలో అకస్మాత్తుగా సోదాలు చేయడం సరైన పద్ధతి కాదని, ఈ తనిఖీలు వారి మనసుల్లో భయాన్ని నింపేలా ఉన్నాయని మండిపడ్డారు. గ్రామాల్లో శాంతి భద్రతలు బాగానే ఉన్నప్పుడు ఇలాంటి భారీ ఆపరేషన్ల అవసరం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల అభిమానాన్ని చాటుతూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంటే పోలీసులు అందుకు భిన్నంగా గిరిజనులను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా సోదాలు చేపట్టినట్లు తెలిపారు. ఎటువంటి నిషేధిత వస్తువులు దొరక్కపోవడంతో గిరిజన గ్రామాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని అంటున్నారు. ఈ ఘటనతో గ్రామాల్లో పెద్దఎత్తున చర్చలు సాగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆపరేషన్ల చేపట్టి అమాయక గిరిజనుల పై భయాందోళనలకు దారి తీయొద్దని కోరుతున్నారు గిరిజన సంఘాల నాయకులు. విజయనగరం పట్టణంలో ఇటీవల సిరాజ్‌పై పేలుళ్ల కుట్ర కేసు పెట్టారని, అతని ఇంటితో పాటు అతని స్నేహితులు, పరిసర ప్రాంతాల ఇళ్లలో ఎందుకు కార్డన్ సెర్చ్ చేయలేదని, కార్డన్ సెర్చ్ చేయడానికి ఎందుకు భయపడ్డారని నిలదీస్తున్నారు. గిరిజనులు అమాయకులు కాబట్టి ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామాల్లో మాత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టి వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…